ఈ 16 నెలల్లో ఏం సాధించారు?
మంత్రి కేటీఆర్‌కు జానా ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో సాధించిందేమిటో చెప్పాలని ప్రతిపక్ష నాయకుడు కె.జానారెడ్డి సవాల్ చేశారు. తెలంగాణ రాష్ట్రావిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో శ్వేతపత్రంతో రావాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ చేసిందేమిటో తగిన పత్రాలతో వస్తే కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు పెడతామన్నారు. ఎవరేం చేశారో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. ఇప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న శంకుస్థాపనలన్నీ కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన పనులేనని చెప్పారు.
మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజవర్గంలో తాగునీరు, అభివృద్ధి కోసం 50 కోట్ల నిధులను తానే ఇచ్చానని జానారెడ్డి వివరించారు. ప్రాణహిత ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేస్తావా అని మంత్రి హరీశ్‌రావును ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టినా సాధ్యంకాదని,. ప్రాణహితను రెండేళ్లలో పూర్తిచేస్తే ప్రతీరోజూ పొగుడుతానని చెప్పారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టి మంచిపేరు తెచ్చుకోవాలని కేటీఆర్, హరీశ్‌రావుకు హితవు పలికారు. పెద్దవారిపై నోటికొచ్చినట్టు మాట్లాడితే అది అహంకారానికి నిదర్శనమన్నారు. సరైన కారణాలు లేకుండా విమర్శలు చేస్తున్న వారి స్థాయికి దిగి మాట్లాడబోనన్నారు.
ప్రభుత్వ పందులు అనలేదు
టీఆర్‌ఎస్ నేతలను ప్రభుత్వ పందులు అన్నట్టుగా ప్రచురితమైన వార్తలు సరికాదని జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలను రాబందులు అని చేసిన విమర్శలను కొట్టిపారేస్తూ కాంగ్రెస్ నేతలు రైతు బంధువులు, ప్రజా బంధువులని అన్నారు. టీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వ బంధువులుగా వ్యవహరిస్తున్నారని మాత్రమే తాను మాట్లాడినట్టుగా జానారెడ్డి వివరణ ఇచ్చారు.