బాధ్యులు ఎవరు
బాధ్యులు ఎవరు
Published Wed, Jul 20 2016 12:38 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఇప్పటికే నష్టాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ ఎన్పీడీసీఎల్)ను కొత్త మీటర్ల కొనుగోలు వ్యవహారం మరింత దెబ్బతీస్తోంది. గృహ వినియోగదారుల కోసం కొనుగోలు చేసిన ఈ రకం మీటర్లలోని లోపాలతో బిల్లు వసూలులో భారీగా తేడా వచ్చే పరిస్థితి నెలకొంది. టెలివిజన్(టీవీ) రిమోట్‌తో కరెంట్ రీడింగ్‌ను నిలిపివేసేలా తయారైన విజన్‌టెక్ మీటర్ల వ్యవహారం ఎన్పీడీసీఎల్‌లో సంచలనంగా మారింది. నిబంధనల ప్రకారమే ఈ మీటర్లను కొనుగోలు చేశారా... అవసరమైన పరీక్షలు, తనిఖీలు పూర్తి చేశారా.. అనే కోణంలో విచారణ జరపాలనే డిమాండ్ సంస్థలోని ఉద్యోగుల నుంచి వస్తోంది. లోపాలు కలిగిన మీటర్లు లక్షల సంఖ్యలో వినియోగదారులకు సరఫరా జరిగేవరకు ఉదాసీనంగా వ్యవహరించిన అధికారుల తీరుపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సంస్థకు భారీగా ఆర్థిక నష్టం తెచ్చే మీటర్ల కొనుగోలు బాధ్యులు ఎవరు... వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఎన్పీడీసీఎల్‌లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఎన్పీడీసీఎల్.. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో విద్యుత్ సరఫరాను నిర్వహిస్తున్నది. ఇళ్లకు కొత్త కనెక్షన్లతోపాటు మీటర్ల కాలిపోయినప్పుడు, సాంకేతిక లోపాలు ఏర్పడినప్పుడు కొత్త మీటర్లు అమర్చుతారు. ఎన్పీడీసీఎల్ ఈ ప్రొక్యూర్‌మెంట్ టెండర్ విధానంలో టెండర్లు పిలిచి, కంపెనీలతో ఒప్పందం చేసుకుని మీటర్లను సేకరిస్తుంది. ఇటీవ నిర్వహించిన టెండర్లలో... విజన్‌టెక్, నైనా పవర్, డెసిబల్, జీనస్ కంపెనీలను మీటర్ల సరఫరా కోసం ఎన్పీడీసీఎల్ ఎంపిక చేసింది. విజన్‌టెక్ 1.40 లక్షలు, నైనా పవర్ 1.90 లక్షలు, డెసిబల్ 55 వేలు, జీనస్ 75 వేలు కరెంటు మీటర్లను సరఫరా చేశాయి.
ఒక్కో మీటరుకు రూ.747 రూపాయల చొప్పున కొనుగోలు చేసిన విజన్‌టెక్ కంపెనీ మీటర్లు ఇప్పుడు ఎన్పీడీసీఎల్‌కు తలనొప్పిగా మారాయి. రూ.10.45 కోట్లతో కొనుగోలు చేసిన ఈ మీటర్లు... టీవీ రిమోట్‌తో రీడింగ్ ఆగిపోతున్నాయి. ఈ విషయం ఇప్పటికే అధికారులకు, పలువురు వినియోగదారులకు తెలిసింది. దీంతో బిల్లు రూపంలో వచ్చే మొత్తంలో తేడా ఉంటోంది. ఇకముందు ఈ తేడా ఇంకా ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ మీటర్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చే ముందు బెంగళూరులోని సెంట్రల్ పవర్ రీసెర్చీ ఇనిస్టిట్యూట్(సీపీఆర్‌ఐ)కు, చెన్నైలోని ఎలక్ట్రానిక్ టెస్ట్ డెవలప్‌సెంటర్(ఈటీడీసీ)కి పంపిస్తారు. అక్కడి పరీక్షల్లో ఆమోదం పొందిన కంపెనీలనే కొనుగోలు చేస్తారు. ఎన్పీడీసీఎల్ కొనుగోలు చేసిన విజన్‌టెక్ మీటర్లను పరీక్షలకు పంపించారా లేదా అనేది సందేహంగా మారింది. ప్రఖ్యాత సంస్థల్లో పరీక్షలు నిర్వహించి ఆమోదం పొందితే రిమోట్‌తో రీడింగ్ ఎలా ఆగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజన్‌టెక్ మీటర్ల కొనుగోలు వ్యవహారంపై ఉన్నతాధికారుల నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
Advertisement