బీజేపీ జిల్లా సారథి ఎవరో?
ఈనెల 29న బీజేపీ జిల్లా అధ్యక్షుని ఎన్నిక
రేసులో కేశ్‌పల్లి ఆనందరెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి..
హైకమాండ్ చెప్తే మళ్లీ ఓకే అన్న గంగారెడ్డి
జిల్లా ఎన్నికల పరిశీలకులుగా వెంకటరమణి..
రెండు రోజుల ముందు అభిప్రాయసేకరణ
జోరందుకున్న ‘సంస్థాగత’ సందడి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో ‘సంస్థాగత’ సందడి జోరందుకుంది. రెండు నెలల కిందటే జరగాల్సిన జిల్లా అధ్యక్షుని ఎన్నిక ఈ నెల 29న జరగనుంది. ఆ పార్టీ అధిష్టానం సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత వెంకటరమణి జిల్లా కమిటీ ఎన్నికలకు ఇన్‌చార్జీగా వ్యవహరించనుండగా.. జిల్లాకు చెందిన జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు కొత్త అధ్యక్షుని ఎన్నికలో కీలకపాత్ర పోషించనున్నారు. 29న జిల్లా కమిటీ ఎన్నికలు జరగనుండగా.. బీజేపీ జిల్లా సారథి ఎవరనేది పార్టీ వర్గాల్లో అప్పుడే చర్చ జరుగుతోంది. అయితే ఎన్నికలకు రెండు రోజుల ముందే 27న పార్టీ సీనియర్లు, పదాధికారుల సమావేశమై కొత్త అధ్యక్షుని ఎన్నికపై అభిప్రాయ సేకరణ చేయనున్నారని తెలిసింది.
మొత్తంగా కొత్త అధ్యక్షుని ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనే నినాదాన్ని కొందరు సీనియర్లు తెరపైకి తీసుకు వస్తుండగా.. పార్టీ కోసం అధిష్టానం సూచనల ప్రకారం పనిచేస్తున్న వారు పోటీకి సిద్ధమవుతున్నారు. పార్టీ కేడర్ మద్దతుతో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నిజామాబాద్ రూరల్ ఇన్‌చార్జి గడ్డం(కేశ్‌పల్లి) ఆనందరెడ్డి ఈ సారి జిల్లా అధ్యక్షపదవికి గట్టీగా ప్రయత్నాలు చేస్తుండగా, ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇన్‌చార్జి బాణాల లక్ష్మారెడ్డి కూడా జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు తెలిసింది. అలాగే ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి కూడా అధిష్టానం ఆదేశిస్తే రెండోసారి కొనసాగేంగుదుకు సుముఖంగా ఉన్నట్లు పేర్కొంటుండటం పార్టీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
‘సంస్థాగతం’పై దృష్టి సారించిన అధిష్టానం
2014 ఎన్నికల్లో జిల్లాలో ఆశించిన మేరకు ఓట్లు రాకున్నా.. కేంద్రంలో నరెంద్రమోదీ ఆధ్వర్యంలో ప్రభుత్వం రావడం ఆ పార్టీ కేడర్‌లో ఊపునిచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలో సంస్థాగతంగా బలపడేందుకు అధిష్టానం ఆదేశానుసారం కమలనాథులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. అక్టోబర్ వరకు సభ్యత్వ నమోదు పూర్తిచేసి, డిసెంబర్ నెలాఖరు వరకు గ్రామ, మండల, జిల్లా కమిటీల ఎన్నికలు నిర్వహించాలని భావించారు. ఈ నేపథ్యంలో 2015 ఆగస్టు నుంచి ఆన్‌లైన్ ద్వారా సభ్యత్వ నమోదుపై దృష్టి సారించారు. అయితే ఈ కార్యక్రమంలో జిల్లాలో కొంతమంది ఇన్‌చార్జీలు మాత్రమే చురుగ్గా పాల్గొన్నారు. జాతీయ, రాష్ట్రస్థాయిలో కీలకంగా వ్యహరిస్తారనే పేరున్న నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే సభ్యత్వ నమోదు కార్యక్రమం ముందుకు సాగలేదు.
జిల్లాలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 1.18 లక్షల సభ్యత్వం నమోదైతే.. ఒక్క నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోనే 46,850 సభ్యత్వం నమోదు చేశారు. జిల్లాలో చాలా గ్రామాల్లో బూత్ కమిటీలు, మండల కమిటీలు ఇంకా వేయాల్సి ఉండగా.. నిజామాబాద్ రూరల్ బూత్ కమిటీలు, మండల కమిటీలు నెలరోజులు కిందటే పూర్తయి, శిక్షణ తరగతులు కూడ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇదే వేగం ఉంటే ఇప్పటికే అన్ని కమిటీలు పూర్తయ్యేవి. అయినప్పటికీ వచ్చే నెలలో రాష్ట్ర కమిటీ ఎన్నికలు జరగనున్నందున, ముందుగానే అన్ని జిల్లా కమిటీలను వేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రెండు నెలల ఆలస్యంగానైనా ఈ నెల 29న జిల్లా అధ్యక్షుని ఎన్నికలు జరిపేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. త్వరితగతిన సంస్థాగత ఎన్నికలను పూర్తి చేయడంపై అధిష్టానం దృష్టి సారించగా... జిల్లా కమిటీ ఎన్నికలు ఆ పార్టీ కేడర్‌లో చర్చకు తెరలేపాయి.
పదాధికారులతో ఆశావహుల మంతనాలు
సభ్యత్వ నమోదు సమయంలో ఈ సారి జిల్లా అధ్యక్ష పదవికి పోటీ ఉండబోదని, కొత్త వారికే అవకాశం వస్తుందన్న చర్చ జరిగింది. తీరా ఎన్నికలు జరిగే సమయం సమీపించడంతో ఆశావహుల సంఖ్య పెరుగుతుండటం పార్టీ వర్గాల్లో చర్చ జోరందుకుంది. జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న పల్లె గంగారెడ్డి జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంలో తనవంతు కృషి చేశారు. ఆయన హయాంలోనే 2014 సార్వత్రిక ఎన్నికలు రాగా.. పార్టీ కోసం పనిచేసిన అందరికీ టిక్కెట్లు రావాలని పొత్తులను గట్టిగా వ్యతిరేకించారు. అయినా అధిష్టానం నిర్ణయం మేరకు పొత్తులతో పోటీ చేయాల్సి రాగా.. ఆ తర్వాత ఆయన రెండోసారి అవకాశం వచ్చినా జిల్లా అధ్యక్షునిగా కొనసాగేందుకు విముఖత చూపారు. అయితే ఈ నెల 29న జిల్లా కమిటీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధిష్టానం తానే ఉండాలని భావిస్తే రెండోసారి కొనసాగుతానంటూ పల్లె గంగారెడ్డి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుం డటం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా వుండగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండోసారి కొనసాగలేనని గంగారెడ్డి తరచూ ప్రస్తావించడంతో.. ఇదే సమయంలో పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న గడ్డం(కేశ్‌పల్లి) ఆనందరెడ్డి జిల్లా అధ్యక్ష పదవిపై ఆశలు పెంచుకున్నారు.
ఇదే క్రమంలో జిల్లా కేంద్రంలో రైతు ధర్నాలు, పార్టీ కార్యక్రమాలు జరిగినా రూరల్ నియోజకవర్గం నుంచి కార్యకర్తలను పిలిపించడం, జాతీయ, రాష్ట్ర నాయకులు, కేంద్ర మంత్రుల పర్యటనలు, సభలు విజయవంతం చేయడం కోసం జిల్లా అధ్యక్షుడి సూచన మేరకు ఆనందరెడ్డి గట్టిగా కృషి చేశారు. మొదటి నుంచి జిల్లా అధ్యక్ష పదవి లక్ష్యంగా పనిచేస్తున్న ఆయన ఈ సారి పోటీలో ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇన్‌చార్జి బాణాల లక్ష్మారెడ్డి కూడా జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ ముగ్గురు నేతలు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేయగా, 27న జరిగే పదాధికారుల అభిప్రాయ సేకరణలో తమ పేరును ప్రతిపాదించాలని ఎవరికీ వారుగా ఫోన్లలో కోరుతుండటం.. జిల్లా అధ్యక్షుని ఎన్నికలు రసకందాయంలో పడినట్లేనన్న చర్చ జరుగుతుంది.