
ఉక్కు సంకల్పమేదీ!
సాక్షి ప్రతినిధి, కడప:
‘ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు–2014 షెడ్యూల్ 13లో హామీ ఉంది. ఆ బిల్లులో ఉన్న అన్నీ అంశాలు నెరవేరుస్తామని కేంద్రప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. అయినప్పటికీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనే చిత్తశుద్ధి కన్పించలేదు. ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది’ అని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి చౌదరి బీరేందర్‌సింగ్‌కు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విన్నవించారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ జిల్లాలో నెలకొంటున్న ఉద్యమాల నేప«థ్యంలో బుధవారం ఆయన
న్యూఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి విజ్ఞాపన అందజేశారు. వివరాలిలా ఉన్నాయి.
గతంలో ఉక్కుశాఖ మంత్రిగా పనిచేసిన నరేంద్రసింగ్ తోమర్జీ దృష్టికి ఇదే విషయాన్ని పలుమార్లు తీసుకువచ్చాం. కడపలో స్టీల్‌ఫ్లాంట్ ఏర్పాటుచేస్తామని రీఆర్గనైజేషన్ బిల్లులో హామీ ఇచ్చారు. అనేకసార్లు ఇదే విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించాం, ఫలితం లేదు. 2016 మార్చి 18 కేంద్ర, రాష్ట్ర అధికారులచే టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేశామంటూ మార్చి 27న ఉక్కుశాఖ మంత్రి నుంచి ఒక లేఖ మాత్రమే అందింది. అనంతరం ఎలాంటి పురోగతి లేదని కేంద్రమంత్రి బిరేందర్‌సింగ్ దృష్టికి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తీసుకువచ్చారు. సత్వరమే స్టీల్‌ఫ్లాంట్‌పై ప్రకటన చేయాలి. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు గడిచిన సమస్య అలాగే ఉండిపోయింది. ప్రజలు నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఇప్పటికే వివిధ ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. స్టీల్‌ఫ్లాంట్ సాధన సమితి ఆధ్వర్యంలో ఇటీవల భారీ బహిరంగసభ నిర్వహించారు. వేలాదిగా విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. విభజన బిల్లులో ఇచ్చిన హామీని కేంద్రం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రప్రభుత్వం ఇంకా జాప్యం చేస్తే ప్రజలకు పార్లమెంటుపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని అవినాష్‌రెడ్డి వివరించారు. మీ నేతృత్వంలో అయినా స్టీల్‌ఫ్లాంట్ ఏర్పాటు చర్య వేగవంతంగా చేపట్టాలని అభ్యర్థించారు. ఆమేరకు స్పందించిన ఉక్కుశాఖ మంత్రి చౌదరి బీరేందర్‌సింగ్ 10రోజల్లో సెయిల్, రెయిల్, ఎన్‌ఎండీసీ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్సుతో సమావేశమై స్టీల్‌ఫ్లాంటు విషయమై చర్చిస్తానని తెలిపారు. ఆగస్టు 2వవారంలో ఎంపీగా మీతో కూడా సమావేశమైతానని ఎంపీ అవినాష్‌రెడ్డికి హామీ ఇచ్చారు.