
ఆయనే కావాలి !
నిడమనూరు : రెండున్నరేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న మహిళ తనకు ఆయనే కావాలని అత్తింటి ఎదుట వారం రోజులుగా చేస్తున్న ఆందోళన సోమవారం కూడా కొనసాగింది. వివరాలు..చండూరు మండలం కురంపల్లికి చెందిన తలారి లింగయ్య, సత్తమ్మల పెద్ద కూతురు సుమలతకు మండలంలోని మారుపాకకు చెందిన ఇస్రం రమేష్‌తో 2014మే30న వివాహం జరిగింది. మొదటి నెల వరకు శోభనం జరుగలేదని దంపతులు తరచూ గొడవ పడేవారు. పెద్ద మనుషుల సమక్షంలో రమేష్ తాను వివాహానికి అనర్హుడిని కాబట్టి విడాకులు ఇవ్వాలని కోరగా వారు ఇద్దరి మధ్య విడాకుల ఒప్పందం చేయించారు. నష్టపరిహారంగా రూ.3 లక్షలను అమ్మాయి తల్లిదండ్రులకు ఇచ్చారు.
పెళ్లి కుదుర్చుకోవడంతో..
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్న రమేష్‌కు ఇటీవల అమ్మాయితో పెళ్లి నిశ్చయం అయింది. ఈ విషయం తెలుసుకుని సుమలత మారుపాకకు వచ్చి రమేష్ ఇంటి ఎదుట భైఠాయించింది. పెద్ద మనుషులు ఇప్పించిన విడాకులతో తనకు సంబంధం లేదని, తనకు రమేష్ భర్తగా కావాలని కోరుకుంటోంది. అయితే ప్రస్తుతం రమేష్ కుటుంబం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. వారం రోజులుగా సుమలత వచ్చి బైఠాయించి సాయంత్రం తిరిగివెళ్లిపోతోంది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందలేదు.