ఇదే మా చివరి పుట్టిన రోజు..
అరవై ఏళ్ల సంసార జీవితంలో ఇద్దరూ అలిసి‘పోయారు’.. నిమిషాల వ్యవధిలోనే ఇద్దరూ తుదిశ్వాస విడిచారు. మరణంలోనూ తాము ఒక్కటేనంటూ కానరాని లోకాలకు వెళ్లిపోయారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన చిమ్మని రామస్వామి(80) ఆదివారం గుండెపోటుతో చనిపోయాడు. ఈవిషయాన్ని బంధువులకు ఫోన్ ద్వారా పనిమనిషి చెబుతుండగానే రామలక్ష్మి (75) ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయింది.
సిరిసిల్ల టౌన్(కరీంనగర్): మరణంలోనూ తాము ఒక్కటేనంటూ కానరాని లోకాలకు వెళ్లిపోయారు ఆ వృద్ధదంపతులు. సిరిసిల్ల పట్టణంలో చోటుచేసుకున్న విషాద సంఘటన ఇది.. ఇల్లంతకుంట మండలం జవారిపేట గ్రామానికి చెందిన చిమ్మని రామస్వామి(80), రామలక్ష్మి(75) దంపతులు. వీరు కొన్నేళ్లక్రితమే సిరిసిల్లకు వచ్చి భావనారుషినగరంలో ఇల్లుకట్టుకుని స్థిరపడ్డారు. రామస్వామి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 1996లో ఉద్యోగ విరమణ పొందారు. దంపతుల కూతుళ్లు కరుణ, అరుణ, సువర్ణ, సుకర్ణకు వివాహం జరిపించారు. రామలక్ష్మి షుగర్, కీళ్లనొప్పులతో బాధపడుతోంది. రామస్వామికి కిడ్నీలో రాళ్లు రావడంతో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం 6గంటలకు ఆయన గుండెపోటుతో చనిపోయారు. ఈవిషయాన్ని బంధువులకు ఫోన్ ద్వారా పనిమనిషి చెబుతుండగానే రామలక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయింది.
రామస్వామి దంపతులు శేషజీవితాన్ని కూతుళ్లు, అల్లుళ్లు, మనుమలు, మనుమరాళ్లతో హాయిగా గడుపుతున్నారు. ఈక్రమంలో ఈనెల 7న రామస్వామి 80వ పుట్టిన రోజు జరిపారు. ఇదేమా చివరి జన్మదినమంటూ దంపతులిద్దరూ వ్యాఖ్యానించారంటూ కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇద్దరమూ ఒకేసారి చనిపోవాలనే వారని గుర్తు చేసుకున్నారు. అన్నట్లుగానే ఇద్దరూ ఒకేసారి చనిపోవడం విషాదాన్ని నింపింది.