Published
Mon, Aug 8 2016 7:30 PM
| Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
భార్యను హత్య చేసిన భర్త
మూలపాడు (ఇబ్రహీంపట్నం): మద్యానికి బానిసైన భర్త కుటుంబ కలహాలతో భార్యను హత్యచేసి పరారయ్యాడు. మూలపాడు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఆళ్లదాసు సూర్యనారాయణ కూలీ పనులు చేస్తుంటాడు. మద్యానికి బానిసైన ఇతను నిత్యం భార్య రమాదేవి (30)తో గొడవపడేవాడు. కేతనకొండ రంగుల కంపెనీలో పనిచేసి ఇంటికొచ్చిన తన భార్యతో ఆదివారం రాత్రి గొడవ పడ్డాడు. ఇరువురి మద్యన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. రాత్రి ఒంటి గంట సమయంలో ఆవేశంతో తన వద్ద ఉన్న కండువాతో రమాదేవిని గొంతు నులిమి చంపాడని బందువులు ఆరోపిస్తున్నారు. అపస్మారక స్థితిలో పడిఉన్న భార్యను చూసి అనుమానంతో సమీపంలోని ఆర్‌ఎంపీ వైద్యుడిని తీసుకొచ్చి చూపించాడు. ఆమెను పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు వైద్యుడు నిర్థారించాడు. భార్య చనిపోయిందన్న విషయాన్ని తెలుసుకున్న సూర్యనారాయణ అక్కడ నుంచి పరారయ్యాడు. తల్లి మరణించి తండ్రి పరారీలో ఉండటంతో మృతురాలికి చెందిన ఇద్దరు మగబిడ్డలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బంధువుల్లో విషాదం నెలకొంది. ఇబ్రహీంపట్నం సీఐ డి.చవాన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పంచనామా నిర్వహించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.