225కిపైగా సీట్లతో అసెంబ్లీ భవనం
రాజధానిలోని ప్రభుత్వ భవనాల సముదాయంలో అసెంబ్లీని 225కిపైగా సీట్లుండేలా నిర్మించాలని ఆర్కిటెక్ట్‌లకు సీఆర్‌డీఏ సూచించింది.ప్రభుత్వ భవనాల సముదాయం
ఆర్కిటెక్ట్‌ల సమావేశంలో చర్చ
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధానిలోని ప్రభుత్వ భవనాల సముదాయంలో అసెంబ్లీని 225కిపైగా సీట్లుండేలా నిర్మించాలని ఆర్కిటెక్ట్‌లకు సీఆర్‌డీఏ సూచించింది.ప్రభుత్వ భవనాల సముదాయం నిర్మాణ శైలి ఎలా ఉండాలనే దానిపై ఆర్కిటెక్ట్‌ల జ్యూరీ, ఆర్కిటెక్ట్ బృందాలతో సీఆర్‌డీఏ నిర్వహించిన రెండు రోజుల వర్క్‌షాపు శనివారం ముగిసింది. అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణంపై చర్చ జరిగింది. శాసనసభ, శాసన మండలి, సెంట్రల్ హాలు, స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ చాంబర్లు ఆయా సభలతో అనుసంధానమై ఉండాలనే నియమాన్ని శాసనసభ కార్యదర్శి సత్యనారాయణ ఆర్కిటెక్ట్‌లకు వివరించారు. సీఎం, మంత్రులు రెండు సభలకు సులువుగా వెళ్లే ఏర్పాట్లు ఉండాలని, శాసనసభ, మండలికి మధ్య సెంట్రల్ హాలులో ఉభయసభల సభ్యులు సమావేశమయ్యేందుకు వీలుగా ఉండాలని సూచించారు.
అధికార, ప్రతిపక్ష సభ్యుల సీట్ల అమరిక, స్పీకర్ స్థానం, సిబ్బంది సీట్లు, విలేకరులు, సందర్శకుల గ్యాలరీలు ఎలా ఉండాలో వివరించారు. రాజ్‌భవన్ నిర్మాణంలో గవర్నర్ నివాసానికి, వివిధ సమావేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. హైకోర్టు హాళ్లు విశాలంగా ఉండాలని, న్యాయమూర్తులు, న్యాయవాదులు, సామాన్య ప్రజలకు వేర్వేరు ప్రవేశ మార్గాలుండాలని కృష్ణా జిల్లా న్యాయమూర్తి, హైకోర్టు నోడల్ అధికారి రవీంద్రబాబు చెప్పారు.