
మహిళ దారుణహత్య
నెలరోజుల తర్వాత వెలుగులోకి
అత్యాచారం చేసి హతమార్చినట్లు అనుమానాలు
అనంతపురం సెంట్రల్ : అనంతపురం నగర శివారులో మహిళ దారుణహత్యకు గురైంది. నెల రోజుల తర్వాత ఈ సంఘటన వెలుగుచూసింది. అస్థిపంజరం సమీపంలో కండోమ్‌లు పడి ఉండటంతో అత్యాచారం చేసిన తర్వాత హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి. తపోవనం సర్కిల్‌కు సమీపంలోని ఆయిల్‌ఫెడ్ కార్యాలయం (పాత డాల్డా ఫ్యాక్టరీ) ఆవరణలోని ముళ్లపొదల్లో మహిళ అస్థిపంజరాన్ని కొందరు యువకులు గురువారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ రోజు రాత్రే ఘటనా స్థలానికి చేరుకోవాలని భావించినా సాధ్యం కాకపోవడంతో శుక్రవారం నాల్గవ పట్టణ ఎస్‌ఐ జీటీ నాయుడు తమ సిబ్బందితో వెళ్లి జేసీబీ సాయంతో ముళ్లపొదలు తొలగించారు.
మృతదేహంలో ఎముకలు తప్ప ఎటువంటి ఆనవాళ్లూ కనిపించలేదు. ఎరువుపురంగు ధరించినట్లు తెలుస్తోంది. 40 సంవత్సరాల వయసు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సమీపంలో కండోమ్‌లు పడి ఉండటాన్ని బట్టి ఆ మహిళ వ్యభిచారై ఉండొచ్చని, లేదా ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, ఆపై హత్య చేశారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. మృతదేహం నుంచి దుర్వాసన వస్తున్నప్పటికీ, పక్కనే మురుగునీరు అంతకన్నా ఎక్కువగా కంపు కొడుతుండటంతో సమీప ప్రజలు ఎవరూ ఈ ఘటనను గమనించలేకపోయారు. మృతదేహానికి శనివారం పంచనామా నిర్వహిస్తామని, త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.