
అనంతపురం / తొండూరు: పులివెందుల – ముద్దనూరు ప్రధాన రహదారిలోని మల్లేల ఘాట్‌లో మత్తేదుల నవితారెడ్డి(27) అనే యువతి దారుణ హత్యకు గురైంది ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక గొర్రెల కాపరులు మల్లేల ఘాట్ సమీపంలో మాలే గంగమ్మకు వెళ్లే రహదారి పక్కనే ఉన్న కొండలోని ఓ చెట్టు కింద యువతి మృతదేహం ఉన్నట్లు శనివారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కొండాపురం సీఐ ఎన్.వెంకటరమణ, ఇన్‌చార్జి ఎస్‌ఐ హజీవలి మృతదేహాన్ని ఫొటో తీసి సంబంధిత పోలీస్‌స్టేషన్లకు పంపారు. ధర్మవరం పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైనట్లు గుర్తించారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన మత్తేదుల నవితారెడ్డి ఈనెల 6వ తేదీన బంగారు నగలు కొనుగోలు చేసేందుకు ప్రొద్దుటూరుకు వెళ్లింది.
నవితారెడ్డి మూడు రోజుల నుంచి ఇంటికి రాకపోవడంతో తండ్రి శివారెడ్డి, తల్లి లక్ష్మిలతోపాటు బంధువులు కలిసి తన కుమార్తెను వెతుకుతూ వచ్చారన్నారు. నవితారెడ్డిని ఎవరైనా బలవంతంగా తీసుకెళ్లి హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నవితారెడ్డిని తమ బంధువులే హత్య చసి ఉంటారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నవితారెడ్డికి ఈ మధ్యకాలంలో పెళ్లి సంబంధాలు చూస్తుండటంవల్ల బంగారు నగలను కొనుగోలు చేసేందుకు ప్రొద్దుటూరులో ఒప్పించారన్నారు. అనంతపురంలోని అనంతలక్ష్మి కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసిందన్నారు.
తన కుమార్తెను పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలనుకున్నామని.. ఇలా హత్యకు గురైందని తల్లిదండ్రులు బోరున విలపించారు. జమ్మలమడుగు డీఎస్పీ కృష్ణన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీంతో నవితారెడ్డిని బలవంతంగా బండరాళ్లతో ముఖంపై, తలపైన కొట్టడంవల్ల అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొండాపురం సీఐ వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు కారకులైన నిందితులను త్వరలో పట్టుకుంటామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment