
భర్తను జీవచ్ఛవంలా చూడలేక..
ఆ దంపతులది.. రెక్కాడితే డొక్కాడని కుటుంబం..ఫుట్‌పాత్‌పై దుస్తులు విక్రయించుకుంటూ పొట్ట పోసుకుంటున్నారు..ఒక్కగానొక్క కూతురుతో ఉన్నంతలో హాయిగానే జీవనం సాగిస్తున్నారు..పచ్చని ఆ కుటుంబంపై విధి కన్నెర్రజేసింది..ఉన్నట్టుండి ఇంటిపెద్ద స్పృహతప్పి పడిపోయాడు..తలకు గాయమై కాళ్లు చేతులు చచ్చుబడి పోయాయి. పేద కుటుంబంపై మోయలేని భారం.. ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేదు.. భర్త జీవచ్ఛవంలా మారడాన్ని చూసి ఆ ఇల్లాలు తట్టుకోలేకపోయింది. ఆదరించేవారు లేక.. భర్తను అలా చూడలేక.. చావే శరణ్యమనుకుని ఏడాది కూతురుతో సహా అగ్నికి ఆహుతై పోయింది. ఈ విషాదకర ఘటన మోటకొండూరు మండలం నాంచారిపేటలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆత్మకూరు(ఎం), మోటకొండూరు:యాదాద్రి భువనగిరి జిల్లాలో మోటకొండూరు మండలం నాంచారిపేట గ్రామానికి చెందిన బచ్చె నవీన్‌కు యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామానికి చెందిన నవ్య(24)తో ఐదేళ్ల క్రితం వివాహం అయింది. వివాహనంతరం హైదరాబాద్‌లోని నాచారంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. పుట్ పాత్‌ల వద్ద రెడిమేడ్ దుస్తులను అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 18నెలల ఒక పాప మాధురి కలదు. నెల రోజుల క్రితం నవీన్ స్పృహతప్పి పడి పోయాడు. కాళ్లు చెతులు కూడా పడిపోయాయి.
తొలుత కూతురుపై పోసి.. ఆపై తానూ..
సమస్యలన్నీ చుట్టుముట్టడంతో నవ్య తట్టుకోలేక పోయింది. కూతురికి పట్టెడన్నం పెట్టలేని దుస్థితి.. భర్తకు చికిత్స చేయించలేక మదనపడిపోయింది. దీంతో చనిపోవాలని నిర్ణయించుకుని తెల్లవారుజామున కూతురుతోటి బాత్‌రూములోకి వెళ్లింది. తొలుత మాధురిపై కిరోసిన్ పోసి.. ఆపై తానూ పోసుకుని నిప్పంటించుకుంది.
మౌన వేదన..
కాసేపటికే మంటలకు తాళలేక భార్య, కుమార్తె కేకలు వినిపిస్తున్నా..అక్కడే ఉండి కాపాడలేని స్థితిలో ఉన్న నవీన్ వేదన కలచివేసింది. వారి కేకలను విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి బాత్ రూము తలుపులు పగులగొట్టేసరికి నవ్య అప్పటికే మృతిచెందింది. కొన ఊపిరితో ఉన్న మాధురిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. సంఘటన స్థలాన్ని ఏసీపీ ఎస్.మోహన్‌రెడ్డి, యాదగిరిగుట్ట సీఐ రఘువీరారెడ్డి, మోటకొండూరు ఎస్‌ఐ రాజు, ఆర్‌ఐ సుగుణ, వీఆర్వో పరమేషం సందర్శించారు. శవ పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్ట్‌మార్టమ్ నిమిత్తం మృతదేహాలను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లికూతురు ఒకే సారి బలవన్మరణానికి పాల్పడటంతో పలువురు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.