వరకట్న వేధింపులకు అబల బలి
Published Sat, Apr 1 2017 10:02 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
కోవెలకుంట్ల: వరకట్న వేధింపులు ఓ నిండు జీవితాన్ని బలి తీసుకున్నాయి. శనివారం కోవెలకుంట్ల పట్టణం సంతపేట కాలనీకి చెందిన షేక్ హబీబా(21) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ మంజునాథ్ చెప్పిన వివరాల మేరకు.. బనగానపల్లె పట్టణానికి చెందిన హబీబాకు కోవెలకుంట్లకు చెందిన షేక్ మహమ్మద్ రఫీ అనే వ్యక్తితో 2014 మే 18వ తేదీన వివాహమైంది. ఇప్పటి వరకు వీరికి సంతానం లేదు. కొంతకాలం నుంచి అదనపు కట్నం తేవాలని భార్యను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేసేవాడు. వేధింపులు తాళలేక జీవితంపై విరక్తి చెంది.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పుంటించుకుని హబీబా ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహమ్మద్ రఫీపై వరకట్న వేధింపుల కేసు నమోదుచేసి శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
Advertisement