కట్న దాహానికి వివాహిత బలి!
Published Fri, Nov 11 2016 2:20 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
సిద్ధాంతం (పెనుగొండ) : ఓ వివాహిత బుధవారం రాత్రి అనుమానాస్పదస్థితిలో ఉరివేసుకుని మరణించింది. ఆమె మరణానికి అత్తింటి వారి వేధింపులే కారణమని ఆమె తల్లి, బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. పాలకోడేరు మండలం గొల్లలకోడేరుకు చెందిన దుర్గాభవానీ(21)కి సిద్ధాంతం శాలిపేటకు చెందిన కుడుపూడి వరప్రసాద్‌తో 2015 జనవరిలో వివాహమైంది. ఆ సమయంలో దుర్గాభవానీ కుటుంబ సభ్యులు ఐదు సెంట్ల భూమి, రూ.ఐదులక్షల నగదు, 20 కాసుల బంగారం కట్నంగా ఇచ్చారు. వివాహ సమయానికి బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న దుర్గాభవాని ప్రస్తుతం నాలుగో సంవత్సరం పరీక్షలు రాస్తోంది. ఎనిమిది నెలలుగా భార్యభర్తలిద్దరూ హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. నెల రోజుల క్రితమే బంధువుల ఇంటిలో ఓ కార్యక్రమం నిమిత్తం సిద్ధాంతం వచ్చారు. పరీక్షలు ఉండడంతో దుర్గాభవానీని ఇక్కడే వదలి వేసి వరప్రసాద్ హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఈ తరుణంలో బుధవారం రాత్రి దుర్గాభవానీ అనుమానాస్పదస్థితిలో ఉరి వేసుకుని మరణించింది.
అత్తింటివారే చంపేశారు
తన కూతురిని అత్తింటివారే చంపేశారని దుర్గాభవాని తల్లి గూడూరి అనంతలక్ష్మి ఆరోపించారు. పెళ్లి సమయంలో ఒప్పందం ప్రకారం కట్న కానుకలు ఇచ్చినా, అదనపు కట్నం కోసం కొంతకాలంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గాభవాని అత్త సిద్ధాంతం పంచాయతీ సభ్యురాలు కుడుపూడి మావుళ్లమ్మ, ఆమె భర్త రామారావు తన కూతురిని నిత్యం హింసిస్తూ కట్నం తేకపోతే చంపేస్తామంటూ పలుమార్లు హెచ్చరించినట్టు వివరించారు. వారే తన కూతురును చంపేసి చీరకు వేలాడ తీశారని విమర్శించారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని హెచ్చరించారు. మృతదేహంపై గాయాలు ఉన్నాయని వివరించారు. అనంతలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ బి.వై.కిరణ్ కుమార్ కేసు నమోదు చేశారు. గురువారం మధ్యాహ్నం నర్సాపురం డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు, పెనుగొండ సీఐ సి.హెచ్.రామారావు దుర్గాభవాని మృత దేహాన్ని పరిశీలించారు. పెనుగొండ తహసీల్దార్ బి.శ్రీనివాసరావుతో కలిసి పంచనామా నిర్వహించారు. దుర్గాభవాని సొంత మండలం పాలకోడేరు నుంచి ఆమె బంధువులు భారీగా తరలివచ్చారు. పలు సంఘాల నాయకులు ఘటనాస్థలానికి వచ్చి మృతురాలి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని హెచ్చరిచారు.
Advertisement