వరకట్న వేధింపులకు వివాహిత బలి
Published Thu, Apr 20 2017 4:11 PM | Last Updated on Fri, May 25 2018 12:54 PM
– కొట్టి చంపేశారని మృతురాలి తల్లి ఫిర్యాదు
రేణిగుంట : మండలంలోని సూరప్పకశం పంచాయతీ అల్లికశంలో మంగళవారం రాత్రి ఒక వివాహిత వరకట్నం వేధింపులతో మృతిచెందింది. రేణిగుంట రూరల్ సీఐ సాయినాథ్, గాజులమండ్యం ఎస్‌ఐ నాగేంద్రబాబు కథనం మేరకు.. అల్లికశంకు చెందిన కౌమతి అలియాస్ గుణవతి(21)కి అదే గ్రామానికి చెందిన ఉమాపతి(25)తో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. ఆ సమయంలో కట్న కానుకలు ఇచ్చి ఘనంగానే వివాహం జరిపించారు. గణపతి ప్రైవేటు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వారికి పిల్లలు కలుగలేదు. ఈ క్రమంలో పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని భర్త గణపతి, అత్తామామలు నిత్యం హింసించేవారు. అలాగే రెండవ పెళ్లికి అంగీకరించాలని తరచూ ఆమెను వేధించేవారు. ఈ నేపథ్యంలో ఆమె మంగళవారం రాత్రి మృతిచెందింది.
అత్తింటి వారే కొట్టి చంపేశారు
కట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేయడంతోపాటు రెండో పెళ్లికి అడ్డుగా ఉందని తన కూతురును భర్త, అత్తామామలు కొట్టి చంపేశారని మృతురాలి తల్లి మునెమ్మ కన్నీరుమున్నీరైంది. మృతురాలి ఎడమ మోచేతిపై కాలిన గాయం, మెడపైన, వివిధ శరీర భాగాల్లో కమిలిన గాయాలు ఉండడంతో మృతిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. మృతురాలి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. సీఐ సాయినాథ్ మాట్లాడుతూ మృతురాలి తల్లి చేసిన ఫిర్యాదు మేరకు వరకట్నం వేధింపుల కేసు నమోదు చేశామన్నారు. తహసీల్దార్ గోవర్దన్ స్వామి సమక్షంలో పంచనామా చేసి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
Advertisement