
పాము కాటుకు మహిళ మృతి
చక్రాయపేట : కుమారకాల్వ గ్రామంలోని గొళ్లపల్లెకు చెందిన ముడియం లక్షుమ్మ(45) అనే మహిళ శుక్రవారం పాము కాటుకు గురై మృతి చెందింది. వివరాలలోకి వెళితే.. శుక్రవారం ఉదయం లక్షుమ్మ తన పొలంలో వ్యవసాయ పనుల కోసం వెళ్లింది. అక్కడ కొద్దిసేపటికి పాము కాటుకు గురి కావడంతో బంధువులు హుటాహుటిన సమీపంలోని రాయచోటికి తీసుకెళ్తుండగా.. మార్గంమధ్యలో పాయలోపల్లె సమీపంలో మృతి చెందింది. ఆమెకు భర్త శేషయ్య, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. వీరు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.