డబ్బులు దండుకునేందుకే మహిళా పార్లమెంటు
ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
నరసరావుపేట : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సు పైపైకి గొప్పలు చెప్పుకునేందుకు, డబ్బులు దండుకునేందుకు తప్పితే మహిళలకు సాధికారిత కల్పించేందుకు కాదని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కోడలు మగపిల్లవాడిని కంటే అత్త వద్దంటుందా అని ఆడపిల్లలను కించపరుస్తూ వ్యాఖ్యానించిన చంద్రబాబు, ఆడవాళ్ళును షెడ్డులో ఉన్న కార్లతో పోల్చుతూ మాట్లాడిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈ సదస్సు నిర్వహించటానికి అర్హులేనా అని ప్రశ్నించారు. నగరి ఎమ్మెల్యే రోజాను సదస్సులో పాల్గొననీయకుండా చేసినందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణ నడిబొడ్డున ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు కొనసాగింది. విగ్రహం వద్ద నిరసన తెలియచేసిన అనంతరం ఎమ్మెల్యే గోపిరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ రోజాను సదస్సుకు ఆహ్వానించి అవమానించటం చాలా దారుణమన్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ అధికారులు ఎవరినీ తమ విధులు నిర్వర్తించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన చేస్తున్నాడన్నారు. తన సొంత కోడలుపై దౌర్జన్యంచేసి మనవడిని అపహరించిన స్పీకర్ కోడెల ఏమాత్రం అర్హుడు కాదన్నారు. అసెంబ్లీలో ఒక ఆడకూతురిని ఏడాదిపాటు సస్పెండ్ చేసిన చరిత్ర స్పీకర్ కోడెలది అన్నారు. అసెంబ్లీలో తమను ఎదిరించి మాట్లాడుతుందోనని, సదస్సుకు హాజరైతే తమ బండారం ఎక్కడ బయటపెడుతుందోనని రోజాను హాజరుకానీయకుండా చేశారన్నారు. ఎమ్మార్వో వనజాక్షి, రిషితేశ్వరి, ఇటీవల మెడికల్ కళాశాలలో పీజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చూస్తుంటే రాష్ట్రంలో ఆడవారికి భద్రతలేదనే విషయం తేటతెల్లమవుతుందని చెప్పారు. సదస్సు నిర్వహణకు కేటాయించిన రూ.13 కోట్ల డబ్బును వాటాలు పంచుకొని దండుకునేందుకు మాత్రమే నిర్వహించారని ఆరోపించారు. జిల్లా కార్యదర్శి ఎస్.సుజాతాపాల్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు మహిళలు అంటే ఏమాత్రం గౌరవలేదన్నారు. ఆడవారు వంటింట్లో ఉండాలి, కారు షెడ్డులో ఉండాలని వ్యాఖ్యానించిన స్పీకర్ కోడెల తన కుమార్తె ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించారు. స్త్రీలను అవమానించటం ఏమాత్రం తగదన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎస్.ఏ.హనీఫ్, కందుల ఎజ్రా, షేక్.ఖాదర్‌బాషా, బాపతు రామకృష్ణారెడ్డి, మద్దిరెడ్డి నరసింహారెడ్డి, షేక్.సైదావలి, వంకా శ్రీనివాసరెడ్డి, షాహిదా, అలీంభాయ్, ఖాజామొహిద్దీన్, పంగులూరి విజయకుమార్, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.