'టీడీపీ కార్పొరేటర్పై చర్యలు తీసుకోవాలి'
► టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా మహిళా సంఘాల ధర్నా
► విమానంలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కార్పొరేటర్
► మేయర్ కారును అడ్డుకున్న మహిళా సంఘాలు
► అడ్డుకున్న పోలీసులు, ఇరువురి మధ్య వాగ్వాదం, అరెస్ట్
► సొమ్మసిల్లి పడిపోయిన పలువురు మహిళలు
విజయవాడ: విజయవాడ కార్పొరేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విజయవాడ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబుకు వ్యతిరేకంగా శనివారం మహిళా సంఘాలు ధర్నాకు దిగాయి. విమానంలో తోటి ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించడంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. విమానంలో మహిళ పట్ల అసభ్యంగా కార్పొరేటర్ చంటిబాబు ప్రవర్తించడంతో మహిళా సంఘాలు ప్రతినిధులు తీవ్రంగా మండిపడ్డారు. మేయర్ కారును మహిళా సంఘాలు అడ్డుకున్నాయి. దాంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. పలువురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. తక్షణమే కార్పొరేటర్పై చర్యలు తీసుకోవాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి.
ఈ నేపథ్యంలో చంటిబాబుకు మద్దతుగా టీడీపీ కార్పొరేటర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. విమానంలో ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆ పార్టీ కార్పొరేటర్లు మద్దతుగా నిలవడం వివాదాస్పదంగా మారింది. వెంకటేశ్వరరావుకు మద్దతుగా టీడీపీ కార్పొరేటర్లు ప్రెస్మీట్ పెట్టడం పట్ల మహిళా సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం పెద్ద సంఖ్యలో మహిళలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని, కార్పొరేటర్ల తీరుకు నిరసనగా ధర్నా చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.