chanti babu
-
'ఆమెకు కేసులు పెట్టడం అలవాటు'
విజయవాడ: విజయవాడ టీడీపీ కార్పొరేటర్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన మహిళ పక్కదారి పట్టే వ్యక్తి అని ఆ పార్టీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ కార్పొరేటర్‌పై కేసు పెట్టిన మహిళ ‘పర్వర్టెడ్ ఫెమినిస్టు’ అని వ్యాఖ్యానించారు. ఆవిడకు కేసులు పెట్టడం అలవాటుగా మారిందని విమర్శించారు. ఢిల్లీ రెస్టారెంట్లో కాలు తగిలిందని 70 ఏళ్ల వృద్ధుడిపై అత్యాచార కేసు పెట్టిన చరిత్ర ఆమెకు ఉందని చెప్పారు. 55 ఏళ్ల మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారనడం నమ్మశక్యంగా లేదన్నారు. దీన్ని పట్టుకుని మహిళా సంఘాలు దుమ్మెత్తిపోయడం దారుణమని అన్నారు. -
కార్పొరేటర్ చంటిబాబుకు నోటీసులు
హైదరాబాద్: విమానంలో తోటి ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులో విజయవాడ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబుకు నోటీసులు ఇవ్వనున్నట్లు శంషాబాద్ డీసీపీ తెలిపారు. ఈ కేసుపై ఆయన వివరణ కోరుతున్నట్లు డీసీపీ చెప్పారు. ఎయిరిండియా విమానంలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు చంటిబాబుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. -
'టీడీపీ కార్పొరేటర్‌పై చర్యలు తీసుకోవాలి'
► టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా మహిళా సంఘాల ధర్నా ► విమానంలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కార్పొరేటర్ ► మేయర్ కారును అడ్డుకున్న మహిళా సంఘాలు ► అడ్డుకున్న పోలీసులు, ఇరువురి మధ్య వాగ్వాదం, అరెస్ట్ ► సొమ్మసిల్లి పడిపోయిన పలువురు మహిళలు విజయవాడ: విజయవాడ కార్పొరేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విజయవాడ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబుకు వ్యతిరేకంగా శనివారం మహిళా సంఘాలు ధర్నాకు దిగాయి. విమానంలో తోటి ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించడంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. విమానంలో మహిళ పట్ల అసభ్యంగా కార్పొరేటర్ చంటిబాబు ప్రవర్తించడంతో మహిళా సంఘాలు ప్రతినిధులు తీవ్రంగా మండిపడ్డారు. మేయర్ కారును మహిళా సంఘాలు అడ్డుకున్నాయి. దాంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. పలువురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. తక్షణమే కార్పొరేటర్‌పై చర్యలు తీసుకోవాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో చంటిబాబుకు మద్దతుగా టీడీపీ కార్పొరేటర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. విమానంలో ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆ పార్టీ కార్పొరేటర్లు మద్దతుగా నిలవడం వివాదాస్పదంగా మారింది. వెంకటేశ్వరరావుకు మద్దతుగా టీడీపీ కార్పొరేటర్లు ప్రెస్‌మీట్ పెట్టడం పట్ల మహిళా సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం పెద్ద సంఖ్యలో మహిళలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని, కార్పొరేటర్ల తీరుకు నిరసనగా ధర్నా చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. -
సీఎం ఉన్నారన్న ధీమాతోనే ఈ అరాచకాలు
విజయవాడ: విమానంలో ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విజయవాడ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబుకు ఆ పార్టీ కార్పొరేటర్లు మద్దతుగా నిలవడం వివాదాస్పదంగా మారింది. వెంకటేశ్వరరావుకు మద్దతుగా టీడీపీ కార్పొరేటర్లు ప్రెస్‌మీట్ పెట్టడం పట్ల మహిళా సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం పెద్ద సంఖ్యలో మహిళలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని, కార్పొరేటర్ల తీరుకు నిరసనగా ధర్నా చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అధికారముందని టీడీపీ నాయకులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని, ఏంచేసినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారనే ధీమాతో అరాచకాలకు పాల్పడుతున్నారని మహిళలు విమర్శించారు. ప్రజల సొమ్ముతో టీడీపీ కార్పొరేటర్లు విహారయాత్రలకు వెళ్లడం సిగ్గుచేటని మండిపడ్డారు. కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు మద్యంమత్తులో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సిగ్గుచేటని, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన చర్యను సమర్థిస్తూ టీడీపీ కార్పొరేటర్లు ప్రెస్ మీట్ పెట్టడాన్ని తప్పుపట్టారు. మహిళలు నల్లజెండాలతో నిరసన ప్రదర్శించారు. -
అసభ్య ప్రవర్తనతో టీడీపీ కార్పొరేటర్ పై కేసు నమోదు
విజయవాడ :విమానంలో తోటి ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించడంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబుపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే... విజ్ఞాన యాత్రకు వెళ్లిన టీడీపీ కార్పొరేటర్ చంటిబాబు విమానంలో చేసిన పోకిరీ చేష్టలు వివాదాస్పదమయ్యాయి. ఓ మహిళ ఫిర్యాదు మేరకు గన్నవరం ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ ఆఫీసర్ భీముడు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు అరగంట సేపు విచారణ నిర్వహించారు. ఈ విషయాన్ని తోటి కార్పొరేటర్లు టీడీపీ నాయకుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు రంగంలోకి దిగి సర్దుబాటు చేసినట్లు సమాచారం. గత నెల 29న విజ్ఞానయాత్రకు వెళ్లిన కార్పొరేటర్ల బృందం ఢిల్లీ నుంచి శుక్రవారం తిరుగు ప్రయాణం కట్టారు. కొందరు టీడీపీ కార్పొరేటర్లు విమానం, మరికొందరు రైల్లో బయలుదేరారు. అయితే చంటిబాబు విమానంలో పక్క సీట్లో ఓ మహిళ ఉన్నారు. తనతో చంటిబాబు అసభ్యంగా ప్రవర్తించాడని ఆ మహిళ హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా సెక్యూరిటీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గన్నవరం సెక్యూరిటీ వింగ్ రంగంలోకి దిగింది. విమానం గన్నవరం చేరుకోగానే సదరు కార్పొరేటర్‌ను సెక్యూరిటీ అధికారులు చుట్టుముట్టారు. అనూహ్య పరిణామంతో టీడీపీ కార్పొరేటర్లు కంగుతిన్నారు. అందరూ కలిసి ఉంటే బుక్కైపోతామని భావించారు. డెప్యూటీ మేయర్ గోగుల రమణారావును చంటిబాబు వద్ద ఉంచి మిగితా వారంతా బయటకు వచ్చేశారు. అనంతరం ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లారు. వారు ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులతో మాట్లాడి చంటిబాబును అక్కడ నుంచి తప్పించారు. గతనెల 30వ తేదీన పూణే లో ఓ కార్పొరేటర్ ట్రయిన్లో మద్యం సేవించి మహిళతో అసభ్యంగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. కార్పొరేటర్ల ఆగడాలతో తలలు పట్టుకున్న టీడీపీ నాయకులు కనీసం ఖండన ఇచ్చే ధైర్యం చేయలేదు. ఈ వివాదం సద్దుమణగక ముందే మరో కార్పొరేటర్ విమానంలో మహిళతో అసభ్యంగా ప్రవర్తించి చిక్కుల్లో పడ్డాడు. అయితే రాజకీయ ఒత్తిళ్లతోనే చంటిబాబును వదిలేశారని గన్నవరం పోలీసులపై విమర్శలొస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ కావటం వల్లే అతడిని వదిలేసినట్లు తెలుస్తోంది. మహిళలతో టీడీపీ కార్పొరేటర్ల వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
తోటకు సీటిస్తే ప్రతిఘటనే..
అధినాయత్వానికి జగ్గంపేట తెలుగు తమ్ముళ్ల అల్టిమేటం జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు ఉపసంహరిస్తామని వార్నింగ్ రాజకీయ సన్యాసం చేస్తానన్న కొండయ్యదొర 24 గంటల్లో చంటిబాబును జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టీకరణ జగ్గంపేట, న్యూస్‌లైన్ : జగ్గంపేటలో తెలుగుదేశం రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. మాజీ మంత్రి తోట నరసింహం కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ చేయడమే ఇందుకు కారణమైంది. జగ్గంపేట టీడీపీ టిక్కెట్టు ఆయనకు ఇస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంతో తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. నియోజవర్గ ఇన్చార్జి జ్యోతుల చంటిబాబుకు ఎమ్మెల్యే టిక్కెట్ లభిస్తుందని గంపెడాశతో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు తాజా పరిణామాలతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. నరసింహం టీడీపీ తీర్థం పుచ్చుకోవడం, జగ్గంపేట టిక్కెట్టు విషయమై మూడు రోజులుగా చంటిబాబుకు వ్యతిరేకంగా పత్రికల్లో కథనాలు రావడంతో పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తక్షణమే మేల్కొనకపోతే తీవ్రంగా నష్టపోతామని భావించిన పార్టీ నాయకులు శుక్రవారం ఉదయం స్థానిక టీడీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎస్వీఎస్ అప్పలరాజు సారథ్యంలో అత్యవసరంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఎవరేమన్నారంటే.. జ్యోతుల చంటిబాబు : జగ్గంపేట స్థానానికి వేరే పేరు వినిస్తుండడంతో మనోవేదనకు గురయ్యాం. లేనిపోని మెసేజ్ బయటకు వెళుతుందని అత్యవసరంగా ఈ సమావేశం ఏర్పాటు చేశాం. పార్టీ నాకు టిక్కెట్టు ఇస్తుందన్న నమ్మకం ఉంది. మార్పులు చేర్పులు చేయవలసివస్తే పార్టీ కొండయ్యదొర, అప్పలరాజుతో చర్చించేవారు. అవేమీ జరగలేదు. తేడా వస్తే మీరు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. కందుల కొండయ్యదొర, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు : మూడు రోజులుగా జగ్గంపేట అభ్యర్థిగా చంటిబాబును కాదని వేరే పేరు వస్తోంది. కార్యకర్తల నుంచి రోజూ వెయ్యి ఫోన్లు రావడంతో సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లను పట్టించుకోకుండా పెద్ద దిక్కుగా ఉన్న యనమల రామకృష్డుడు, చినరాజప్పల వద్దకు తిరిగాం. పత్రికల్లో వస్తున్న వార్తలను అవకాశమున్నా వారు ఖండించలేదు. నియోజకవర్గంలో కనీసం జెడ్పీటీసీ, ఎంపీటీసీలను నెగ్గించుకోలేని వ్యక్తిని ఎవరికీ చెప్పకుండా పార్టీలోకి తీసుకున్నారు. తోట నరసింహానికి జగ్గంపేట సీటిస్తే ఇక్కడ టీడీపీ పరిస్థితి సీమాంధ్రలో కాంగ్రెస్‌లా అవుతుంది. ఎమ్మెల్యే సీటును 24 గంటల్లోగా చంటిబాబుకు ప్రకటించాలి. చంటిబాబును కాదని వేరే వ్యక్తికి సీటిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. (అంటూ కన్నీరు పెట్టుకున్నారు.) మా డిమాండ్‌కు బదులు రాకపోతే శనివారం సాయంత్రం మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటాం. ఎస్వీఎస్ అప్పలరాజు : కార్యకర్తలు ఆందోళన చెందవద్దు. అధిష్టానంతో మాట్లాడాం. సానుకూలంగా స్పందించకపోతే తీవ్రంగా ప్రతిఘటిస్తాం. టీడీపీ గోకవరం, గండేపల్లి మండల అధ్యక్షులు దొడ్డా విజయభాస్కర్, పోతుల మోహనరావు : చంటిబాబుకు సీటు ఇవ్వకపోతే మా మండలాల నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు ఉపసంహరించుకుంటాం.దాడి రంగారావు, కిర్లంపూడి : చంటిబాబుకు టిక్కెట్టు ఇవ్వకుంటే జెడ్పీటీసీకి వేసిన నామినేషన్ ఉపసంహరించుకుంటాను. కొత్త భైరవకృష్ణ, జగ్గంపేట : ఎమ్మెల్యే టిక్కెట్‌కు ప్రయత్నించడం మంచిది కాదని నరసింహానికి మూడు రోజుల క్రితం ఫోన్లో తెలిపాను.విలేకర్ల సమావేశంలో ఎస్వీ ప్రసాద్, ఉంగరాల రాము, తమటం నాగేశ్వరరావు, తాండ్రోతు రామారావు తదితరులు కూడా మాట్లాడారు. జ్యోతుల రామస్వామి, నిమ్మగడ్డ సత్యనారాయణతో పాటు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచీ భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు.