అధినాయత్వానికి జగ్గంపేట తెలుగు తమ్ముళ్ల అల్టిమేటం
జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు ఉపసంహరిస్తామని వార్నింగ్
రాజకీయ సన్యాసం చేస్తానన్న కొండయ్యదొర
24 గంటల్లో చంటిబాబును జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్
లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టీకరణ
జగ్గంపేట, న్యూస్‌లైన్ :
జగ్గంపేటలో తెలుగుదేశం రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. మాజీ మంత్రి తోట నరసింహం కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ చేయడమే ఇందుకు కారణమైంది. జగ్గంపేట టీడీపీ టిక్కెట్టు ఆయనకు ఇస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంతో తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు.
నియోజవర్గ ఇన్‌చార్జి జ్యోతుల చంటిబాబుకు ఎమ్మెల్యే టిక్కెట్ లభిస్తుందని గంపెడాశతో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు తాజా పరిణామాలతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. నరసింహం టీడీపీ తీర్థం పుచ్చుకోవడం, జగ్గంపేట టిక్కెట్టు విషయమై మూడు రోజులుగా చంటిబాబుకు వ్యతిరేకంగా పత్రికల్లో కథనాలు రావడంతో పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
తక్షణమే మేల్కొనకపోతే తీవ్రంగా నష్టపోతామని భావించిన పార్టీ నాయకులు శుక్రవారం ఉదయం స్థానిక టీడీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎస్‌వీఎస్ అప్పలరాజు సారథ్యంలో అత్యవసరంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
సమావేశంలో ఎవరేమన్నారంటే..
జ్యోతుల చంటిబాబు : జగ్గంపేట స్థానానికి వేరే పేరు వినిస్తుండడంతో మనోవేదనకు గురయ్యాం. లేనిపోని మెసేజ్ బయటకు వెళుతుందని అత్యవసరంగా ఈ సమావేశం ఏర్పాటు చేశాం. పార్టీ నాకు టిక్కెట్టు ఇస్తుందన్న నమ్మకం ఉంది. మార్పులు చేర్పులు చేయవలసివస్తే పార్టీ కొండయ్యదొర, అప్పలరాజుతో చర్చించేవారు. అవేమీ జరగలేదు. తేడా వస్తే మీరు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాను.
కందుల కొండయ్యదొర, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు : మూడు రోజులుగా జగ్గంపేట అభ్యర్థిగా చంటిబాబును కాదని వేరే పేరు వస్తోంది. కార్యకర్తల నుంచి రోజూ వెయ్యి ఫోన్లు రావడంతో సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లను పట్టించుకోకుండా పెద్ద దిక్కుగా ఉన్న యనమల రామకృష్డుడు, చినరాజప్పల వద్దకు తిరిగాం. పత్రికల్లో వస్తున్న వార్తలను అవకాశమున్నా వారు ఖండించలేదు.
నియోజకవర్గంలో కనీసం జెడ్పీటీసీ, ఎంపీటీసీలను నెగ్గించుకోలేని వ్యక్తిని ఎవరికీ చెప్పకుండా పార్టీలోకి తీసుకున్నారు. తోట నరసింహానికి జగ్గంపేట సీటిస్తే ఇక్కడ టీడీపీ పరిస్థితి సీమాంధ్రలో కాంగ్రెస్‌లా అవుతుంది. ఎమ్మెల్యే సీటును 24 గంటల్లోగా చంటిబాబుకు ప్రకటించాలి.
చంటిబాబును కాదని వేరే వ్యక్తికి సీటిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. (అంటూ కన్నీరు పెట్టుకున్నారు.) మా డిమాండ్‌కు బదులు రాకపోతే శనివారం సాయంత్రం మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటాం.
ఎస్‌వీఎస్ అప్పలరాజు : కార్యకర్తలు ఆందోళన చెందవద్దు. అధిష్టానంతో మాట్లాడాం. సానుకూలంగా స్పందించకపోతే తీవ్రంగా ప్రతిఘటిస్తాం.
టీడీపీ గోకవరం, గండేపల్లి మండల అధ్యక్షులు దొడ్డా విజయభాస్కర్, పోతుల మోహనరావు : చంటిబాబుకు సీటు ఇవ్వకపోతే మా మండలాల నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు ఉపసంహరించుకుంటాం.దాడి రంగారావు, కిర్లంపూడి : చంటిబాబుకు టిక్కెట్టు ఇవ్వకుంటే జెడ్పీటీసీకి వేసిన నామినేషన్ ఉపసంహరించుకుంటాను.
కొత్త భైరవకృష్ణ, జగ్గంపేట : ఎమ్మెల్యే టిక్కెట్‌కు ప్రయత్నించడం మంచిది కాదని నరసింహానికి మూడు రోజుల క్రితం ఫోన్‌లో తెలిపాను.విలేకర్ల సమావేశంలో ఎస్వీ ప్రసాద్, ఉంగరాల రాము, తమటం నాగేశ్వరరావు, తాండ్రోతు రామారావు తదితరులు కూడా మాట్లాడారు. జ్యోతుల రామస్వామి, నిమ్మగడ్డ సత్యనారాయణతో పాటు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచీ భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు.
తోటకు సీటిస్తే ప్రతిఘటనే..
Published Sat, Mar 22 2014 12:10 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement