
ప్రకృతి హననం
♦ సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు
♦ పగలు నరికివేత.. రాత్రి హైదరాబాద్‌కు తరలింపు
♦ అనుమతులు లేకుండా ఇష్టారాజ్యం
♦ అప్పుడప్పుడు అధికారుల తనిఖీలు
♦ నామమాత్రపు జరిమానాలతో సరిపెడుతున్న వైనం
♦ పెద్దపెద్ద వృక్షాలను నరికి అమ్ముకుంటున్న వ్యాపారులు
♦ అధికారుల కనుసన్నల్లోనే కొనసాగుతున్న కలప దందా
కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాడు మానవుడు. దెబ్బతింటున్న పర్యావరణాన్ని కాపాడుకునేందుకు మొక్కలు నాటాల్సిందిపోయి.. ఏళ్లుగా పర్యావరణానికి ప్రాణం పోస్తున్న చెట్లను నిలువునా కూల్చేస్తున్నాడు. ప్రకృతి ప్రకోపానికి నేలకూలేవి కొన్నయితే.. మనిషి అజ్ఞానానికి బలవుతున్నవి కొన్ని. జిల్లా వ్యాప్తంగా ‘రియల్’ మైకంలో ఇప్పటికే పచ్చదనం కనుమరుగైంది. ప్రకృతిని హరించి కాంక్రీట్ జంగల్‌ను నిర్మించేస్తున్నారు. పెద్దపెద్ద వృక్షాలను కూల్చి సామిల్స్‌కు తరలిస్తున్నారు. దీనికి తోడు కలప వ్యాపారులు చిన్నాపెద్ద వృక్షాలను చెరబడుతున్నారు. పగలంతా నరికేయడం.. రాత్రిళ్లు తరలించుకుపోవడం. జిల్లా నుంచి రోజూ పదుల సంఖ్యలో కలప లారీలు హైదరాబాద్‌కు చేరుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా సాగుతున్న ఈ దందా అధికారులు కనుసన్నల్లో జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. - పరిగి
రైతుల నుంచి తక్కువ ధరలకు చెట్లు కొనుగోలు చేస్తున్న దళారులు వాటిని నగరానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. చెట్లు నరకడం మొదలు.. కలప రవాణా.. విక్రయాలను అడ్డుకోవాల్సిన అటవీశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వారి కనుసన్నల్లోనే అక్రమ దందా జరుగుతోందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం చెట్లను నరికే సమయంలో ప్రతిఒక్కరు రెవెన్యూ అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉంది. కాని అదేమి జరగడం లేదు. ఇటీవల పరిగికి చెందిన సామిల్లుకు తరలిస్తున్న అక్రమ కలప ట్రా క్టర్ పట్టుబడటంతో పలు విషయాలు వెలుగుచూశాయి.
నామమాత్రపు తనిఖీలు..
అక్రమ కలప దందాలో అటు పోలీసులు, ఇటు అటవీశాఖ అధికారులకు సైతం మామూళ్లు అందుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే తూతూ మంత్రంగా తనిఖీలతో సరిపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతరులెవరైనా కలప లారీలను పట్టించడమో.. లేదా పోలీసుల సాధారణ తనిఖీలు, పెట్రోలింగ్‌లో అప్పుడప్పుడు పట్టుకోవడమో తప్పిస్తే చెట్లు నరకడం, విక్రయాలపై సంబంధిత యంత్రాంగం నిఘానే కరువైపోయింది.
అడ్డాలుగా కట్టెల మిషన్లు..
పరిగి ప్రాంతంలో కుప్పలుతెప్పలుగా వెలుస్తున్న సా మిల్లులు(కట్టెల మిషన్లు), కార్పెంటర్ దుకాణాలు అక్రమ కలప వ్యాపారానికి అడ్డాలుగా మారుతున్నాయి. ఈ వ్యాపారంపై నిఘా కొరవడడంతో నిత్యం ఈ దందాకు సంబంధించి లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఓ పక్క ప్రభుత్వం చెట్లను పెంచేందుకు హరితహారం వంటి కార్యక్రమాలు చేపడుతుంటే అక్రమార్కులు మాత్రం ఉన్నచెట్లను నరికివేస్తూ రూ. కోట్లు గడిస్తున్నారు. చెట్లను కాపాడాల్సిన యంత్రాంగం పట్టించుకోకపోవడంతో అంతా వారి కనుచూపుల్లోనే జరుగుతోందని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెట్ల నరికివేతను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.