మాట్లాడుతున్న పీఓ రాజీవ్
-
ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు
భద్రాచలం : అధికారులు గిరిజనుల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలని ఐటీడీఏ పీఓ రాజీవ్ గాంధీ హన్మంతు అన్నారు. భద్రాచలం ఐటీడీఏలో సోమవారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతాలు అభివృద్ధి సాధించినప్పుడే స్వాతంత్య్ర ఫలాలు దక్కినట్లుగా భావించాలన్నారు. దీనికోసం అధికారులు, ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఏజెన్సీ పరిధిలోని విద్యాసంస్థల ద్వారా 41,297 మంది విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడుతున్నట్లు చెప్పారు. గత ఏడాది పదో తరగతిలో 91 శాతం ఫలితాలు సాధించామని, ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగేలా తగిన కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. హరితహారంలో భాగంగా 25,436 మొక్కలను పాఠశాలల ప్రాంగణాల్లో నాటామన్నారు. సీజన ల్ వ్యాధుల నివారణకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాలకు 400 చొప్పున, ఇల్లెందుకు 380 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం కింద ఏజెన్సీ పరిధిలోని 24 మండలాల్లో 1,12,688 కుటుంబాలకు చెందిన 1,89,995 మంది కూలీలకు 47.56 లక్షల పనిదినాలు కల్పించి.. వేతనాల కింద రూ.59.92కోట్లు చెల్లించినట్లు తెలిపారు. రూ.13.87లక్షలతో ఆయిల్ ఇంజన్‌లు, సైకిళ్లు, పైపులు, కట్టుమిషన్లు అందజేశామన్నారు. అనంతరం ట్రైకార్ పథకంలో భాగంగా టాటా మేజిక్ ఆటోలను లబ్ధిదారులకు అందజేశారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఐటీడీఏ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భద్రాచలంలోని లిటిల్æఫ్లవర్ విద్యార్థులు చేసిన జై తెలంగాణ గీతానికి పీఓతోపాటు ఇతర యూనిట్ అధికారులంతా హర్షధ్వానాలతో ఉత్తేజపరిచారు. ఐటీడీఏలోని వివిధ విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులు, అధికారులకు పీఓ రాజీవ్ ప్రశంసా పత్రాలను అందజేశారు. అలాగే లిటల్ ఫ్లవర్ విద్యార్థుల తరఫున విద్యాసంస్థల చైర్మన్ మాగంటి సూర్యంకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, డీడీ జయదేవ్ అబ్రహం, ఏజెన్సీ డీఈఓ రవీందర్, ఏపీఓ జనరల్ కె.భీమ్‌రావు, ఐకేపీ ఏపీడీ జయశ్రీ, ఎస్‌పీహెచ్‌ఓ డాక్టర్ కోమల, డీఎంఓ రాంబాబు, డీసీఓ బురాన్, మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ నారాయణరెడ్డి, ఏజీపీ సాల్మన్ రాజు పాల్గొన్నారు.