భారతదేశం వివిధ భాషలు, ఆహార– ఆహార్యాలు, ప్రాంతాలు, కుల – మత – వర్గాలు, సంస్కృతీ సంప్రదాయాల సంగమస్థలి. భారతీ యాత్మకు ఇదే నిదర్శనం. భారత్‌పై దండయాత్రలు చేసిన విదేశీయ శక్తులన్నీ ఈ వైవిధ్యాన్ని ఉపయో గించుకొని, విభజించి పాలించు విధానం ద్వారానే ఆధిపత్యం చలాయించాయి. ఆనాటి దురాక్రమణ దారులే కాదు, ఇప్పటి కొన్ని విదేశీ శక్తులు సైతం ఈ దేశ సమగ్రతను విచ్ఛిన్నం చేసే దుర్బుద్ధితో ప్రజల మధ్య విభేదాలు రాజేస్తున్నాయి. స్వాతం త్య్రానంతరం అనేక రాజకీయ పార్టీలు తమ కంటూ ఓటు బ్యాంకులు సృష్టించుకోవడానికి ఈ తరహా విచ్ఛిన్నకర రాజకీయాలనే అనుసరించాయి, నేటికీ అనుస రిస్తున్నాయి.
మన దేశంలో రెండు రకాల రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఉన్నారు. దేశ విభిన్నత్వాన్ని కాపాడుతూనే సమైక్యతకు పాటుపడేవారు ఒకరకం. జాతీయ సమైక్యతా భావనను తుంగలో తొక్కి విభేదాలను విద్వేషాల స్థాయికి తీసుకెళ్లి, పబ్బం గడుపుకొనేవారు రెండోరకం. లక్షలాది భారతీయుల ఉచకోతకు, కోట్లాది మంది నిరాశ్రయులు కావడానికి దారితీసిన దేశ విభజన వంటి విషాద ఘటనల నుంచి వారింకా ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదు. నేర్చుకోరు.
కాంగ్రెస్ వారసుడు రాహుల్ గాంధీ రెండో తరహా నాయకుల కోవకు చెందినవారు. కుటుంబ పాలన నిలబెట్టుకోవడానికి తన పార్టీ ఇన్నాళ్లూ అనుసరిస్తూ వచ్చిన విధానానికి భిన్నమైన రీతిలో ఆయన పాదయాత్ర చేపట్టారు. దేశ విభజనకు కారణమైన వయోవృద్ధ కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో ఇప్పుడు సాగుతున్న నాటకానికి సూత్రధారి కావడమే విచిత్రం, విస్మయకరం.
దేశాన్ని కలిపి ఉంచుతున్నది ఏమిటో, ఎందుకో – రాహుల్ గాంధీకి పట్టదు, పట్టింపు లేదు. ఆయన ముత్తాత, దేశ ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ వేసిన బాటలోనే ఆయన పయనిస్తున్నారు. దేశాన్ని ఒకటి చేస్తున్న దేమిటో తెలుసుకోవడానికి, కనీసం అర్థం చేసుకోవడానికీ ఆనాడు నెహ్రూ ప్రయత్నించలేదు. ‘‘ఏదో వారిని (ప్రజల్ని) కలిపి ఉంచుతోంది. భారత్ విభిన్న నైసర్గిక, ఆర్థిక, సాంస్కృతిక స్వరూప – స్వభావాలు కలిగి ఉన్నది. అనేక వైరుధ్యాలు! అయినప్పటికీ – ఏవో తెలియని గట్టి బంధాలు వారందరినీ కలిపి ఉంచుతున్నాయి’’ – అని స్వాతంత్య్రానికి ఏడాది ముందు ప్రచురించిన ‘ద డిస్కవరీ ఆఫ్ ఇండియా’ పుస్తకంలో ఆయన పేర్కొన్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ, జవహర్‌లాల్ నెహ్రూ చేసిన తీవ్ర తప్పిదాలకు భారత్ భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. ఆయన, ఆయన వారసులు తీసుకున్న అనేక చర్యలు దేశంలో విభజన బీజాలే నాటాయి.
దేశాన్ని కలిపి ఉంచుతున్న బలమైన బంధం ఏమిటన్నది నెహ్రూకు అర్థంగాక పోవడం వల్లనే కశ్మీర్ సమస్య ఆరని కుంపటి అయ్యింది. భారతీయత కన్నా ఒక మతమే మిన్న అనీ, దేశ భిన్నత్వాన్ని కాపాడాలంటే ఆ మతానికే అగ్ర ప్రాధాన్యం ఇవ్వక తప్పదన్న దురవగాహనే వారిని ముందుకు నడిపింది, దేశాన్ని వెనక్కి నడిపింది. ఆ దరవ గాహనతోనే నెహ్రు, కశ్మీర్ సమస్యను అంత ర్జాతీయం చేశారు.
ఎనిమిదేళ్లనాడు నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చేదాకా – కశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదం కరాళ నృత్యం చేసింది. కశ్మీర్ విషయంలో కాంగ్రెస్ తçప్పులు చేసినందువల్లే రెండు మత వర్గాల మధ్య దూరం మరింత పెరిగింది. దాని ఓటుబ్యాంకు రాజకీయాలతో సమస్య ముదిరింది. ఇందుకు పూర్తి బాధ్యత కాంగ్రెస్‌దే. ఈ బాధ్యతను అది స్వీక రిస్తుందా? ఇది జోడోనా లేక తోడోనా? నెహ్రూ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరంకుశ నిజాం కబంధ హస్తాల నుంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కల్పించడానికి సర్దార్ పటేల్ గట్టి చర్యలు చేపట్టకపోయి ఉంటే... దేశం మధ్యలో తెలంగాణ మరో అగ్ని గుండమయ్యేది.
రాహుల్ కుటుంబ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం దేశ ప్రజల మధ్య కులమతాలు, ప్రాంతాలు, భాషలంటూ విభజన రేఖలు గీసింది. మహిళల అభ్యున్నతి గురించి రాహుల్ తరచూ మాట్లాడుతుంటారు. ఇతర మతాలకు చెందిన మహిళలతో సమానంగా ముస్లిం మహిళలకూ హక్కులు కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పుడు – రాహుల్ తండ్రి, అప్పట్లో ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ దాన్ని అటకెక్కించారు. దేశ ప్రజలందరినీ ఒకే గాటన కట్టే దిశలో ముందడుగు వేసే బదులు, భిన్న మతాలు, విభిన్న సంస్కృతీ– సంప్రదాయాలు, ఆచార–వ్యవహారాలు అంటూ వారి మధ్యన మరింత ఎత్తున గోడలు కట్టారు. లింగాయత్‌లు–హిందువులు; రాజ్‌పుత్‌లు–ఇతరులు; హిందువులు–ముస్లింలు; దళితులు–అగ్ర కులాలు అంటూ వివిధ వర్గాల మధ్య చిచ్చు పెట్టి, తమాషా చూడట మొక్కటే పరమ పవిత్ర కర్తవ్యంగా ఆ పార్టీ భావిస్తోంది. తన ‘తోడో’ రాజకీయాల కోసం అందివచ్చే ఎలాంటి అవకాశాన్నీ కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టడం లేదు.
130 కోట్ల మందికి పైగా భారతీయులు భక్తి – శ్రద్ధలతో దేశ స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకొంటున్న వేళ... భారత్ ఒక దేశం కాదు, జాతీ కాదు, కేవలం రాష్ట్రాల సమాహారం మాత్రమేనంటూ వింత, వితండ వాదనను రాహుల్ తెరమీదకు తెచ్చారు. నెహ్రూ పేర్కొన్నట్లు – దేశ ప్రజలందరినీ కలిపి ఉంచుతున్న బలమైన బంధం– భారతీయత – అంటే ఏమిటన్నది అర్థం చేసుకోగలిగితే– ‘జోడో’ లక్ష్యం సాధించే దిశగా సాగిపోవడం, గమ్యం చేరడం రాహుల్ గాంధీకి పెద్ద కష్టమేమీ కాదు! (క్లిక్ చేయండి: భారత్ జోడో పాదయాత్రతో కొత్త ఉత్సాహం)
- కిశోర్ పోరెడ్డి
బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధికార ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment