సాక్షి, చెన్నై: బీజేపీ, ఆరెస్సెస్ దేశాన్ని పథకం ప్రకారం మతం, భాష పేరిట నిలువునా విభజిస్తున్నాయంటూ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ దుయ్యబట్టారు. ‘‘అన్ని మతాలకు, ప్రాంతాలకు, రాష్ట్రాలకు సొంతమైన త్రివర్ణ పతాకాన్ని తమ సొంత ఆస్తిగా బీజేపీ, ఆరెస్సెస్ భావిస్తున్నాయి. దేశంలో మోదీ సర్కారు దాడికి గురవని వ్యవస్థ, సంస్థ అంటూ లేవు. బీజేపీ అసమర్థ పాలన వల్ల దేశం ఎన్నడూ లేనంతటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.
నిరుద్యోగిత ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు, త్రివర్ణ స్ఫూర్తిని కాపాడుకునేందుకు పౌరులంతా కలిసి రావాలి’’ అంటూ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ భారత్ జోడో పాదయాత్రను బుధవారం తమిళనాడులోని కన్యాకుమారిలో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఊపి లాంఛనంగా ప్రారంభించారు. సముద్ర తీరంలో దివంగత సీఎం కె.కామరాజ్ స్మారక మందిరం దాకా పాదయాత్ర చేశారు.
అనంతరం పార్టీ నేతలను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘దేశ సమైక్యత కోసం తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని కోట్లాది మంది పౌరులు భావిస్తున్నారు. అందుకే ఈ యాత్ర’’ అని ప్రకటించారు. ‘‘మోదీ సర్కారు అచ్చం బ్రిటిష్ పాలకుల్లా విభజించి పాలించు సూత్రాన్నే అమలు చేస్తోంది. రైతులు, ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు... ఇలా ప్రతి వర్గాన్నీ పథకం ప్రకారం పీడిస్తోంది. వారిని కొట్టి ఒకరిద్దరు బడా బాబులకు దేశాన్ని దోచిపెడుతోంది. వారు లేకుండా మోదీ ఒక్క రోజు కూడా రాజకీయంగా మనలేరు.
అప్పట్లో ఈస్టిండియా కంపెనీ దేశాన్ని నియంత్రించేది. ఇప్పుడు దేశాన్ని ఓ మూణ్నాలుగు బడా కంపెనీల నియంత్రణలోకి బీజేపీ సర్కారు నెట్టింది. దీనిపై ప్రశ్నించకుండా మీడియాను అణగదొక్కుతోంది. విపక్షాలు నిలదీయకుండా ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థల ద్వారా భయపెట్టజూస్తోంది. కానీ ఎంత వేధించినా ఒక్క విపక్ష నాయకుడూ భయపడబోడు. ఈ త్రివర్ణం మనకు అంత తేలిగ్గా లభించలేదు. కానుకగానూ రాలేదు. ప్రాణాలకు తెగించి పోరాడి సాధించుకున్నది. అలాంటి జాతీయ పతాకమే ఇప్పుడు ఆరెస్సెస్, బీజేపీ కాషాయీకరణ తాలూకు ముట్టడిలో ఉంది’’ అన్నారు.
12 రాష్ట్రాలు, 150 రోజులు, 3,570 కి.మీ.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా సాగే భారత్ జోడో యాత్రకు రాహుల్ సారథ్యం వహించనున్నారు. 119 మంది కాంగ్రెస్ నేతలు ఆయనతో పాటు కలిసి నడుస్తారు. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా 3,570 కిలోమీటర్ల దూరం 150 రోజుల పాటు యాత్ర సాగుతుంది. దీన్ని స్వతంత్ర భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ తలపెట్టిన అత్యంత సుదీర్ఘ యాత్రగా కాంగ్రెస్ అభివర్ణిస్తోంది. డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రాహుల్ చేతికి జాతీయ పతాకాన్ని అందించారు. కన్యాకుమారిలోని గాంధీ స్మారకం వద్ద రాహుల్‌కు ఆయన స్వాగతం పలికారు.
సామూహిక ప్రార్థనల అనంతరం ప్రఖ్యాత వివేకానంద శిలా స్మారకాన్ని రాహుల్ సందర్శించారు. గాంధీ స్మారక మండపంలో ధ్యానం చేశారు. రఘుపతి రాఘవ రాజారాంతో పాటు తమిళ మహాకవి సుబ్రమణ్య భారతి రచించిన పలు దేశభక్తి గీతాల ఆలాపన నడుమ యాత్రను ప్రారంభించారు. ‘‘దేశ సమగ్రతకు, సమైక్యతకు, వైవిధ్యానికి, ఆత్మగౌరవానికి చిహ్నమైన త్రివర్ణాన్ని చేబట్టి భారత్ జోడో యాత్రలో ఈ రోజు తొలి అడుగు వేస్తున్నాం. నడవాల్సిన దూరం ఎంతో ఉంది. అంతా కలిసి దేశాన్ని మరోసారి సమైక్యం చేద్దాం రండి’’ అంటూ ట్వీట్ చేశారు.
చరిత్రాత్మక సందర్భం: సోనియా
భారత్ జోడోయాత్రను చరిత్రాత్మక సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అభివర్ణించారు. పార్టీ పునరుజ్జీవానికి ఇది దోహదపడుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఇది దేశ రాజకీయాలను కూడా మేలిమలుపు తిప్పే సందర్భమన్నారు. ‘‘వైద్య పరీక్షల నిమిత్తం విదేశాల్లో ఉన్నందున యాత్రలో పాల్గొనలేకపోతున్నా. కానీ మానసికంగా యాత్రలో ప్రతి రోజూ పాల్గొంటూనే ఉంటా’’ అంటూ ఆమె సందేశం పంపారు.
రాజీవ్‌కు నివాళులు
యాత్ర ప్రారంభానికి ముందు శ్రీపెరంబుదూరులో దివంగత ప్రధాని, తన తండ్రి రాజీవ్‌గాంధీకి రాహుల్ ఘనంగా నివాళులు అర్పించారు. విద్వేష, విభజన రాజకీయాలే తన తండ్రిని బలి తీసుకున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. దేశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి బలిపె ట్టబోనన్నారు. ‘‘ద్వేషాన్ని ప్రేమ, భయాన్ని ఆశ జయిస్తాయి (అన్బు వెరుప్‌పై వెల్లుం). . కలసికట్టుగా సమస్యలను అధిగమిద్దాం’’ అంటూ తమిళంలో ట్వీట్ చేశారు. రాజీవ్ స్మారకం వద్ద మొక్క నాటారు. 1991 మే 21న లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా శ్రీపెరంబుదూరులో ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడికి రాజీవ్ బలవడం తెలిసిందే.
యాత్ర సాగేదిలా...
గురువారం ఉదయం ఏడింటికి కన్యాకుమారిలో రాహుల్ తదితరులు యాత్రకు శ్రీకారం చుడతారు. ఉదయం 10.30 దాకా, తిరిగి మధ్యాహ్నం 3.30 నుంచి 6.30 దాకా సగటున రోజుకు 23 కిలోమీటర్లు పాదయాత్ర సాగుతుంది. తిరువనంతపురం, కొచ్చి, నీలంబూర్, మైసూర్, బళ్లారి, రాయచూర్, వికారాబాద్, నాందేడ్, జల్‌గావ్, ఇండోర్, కోటా, దౌసా, ఆళ్వార్, బులంద్‌షహర్, ఢిల్లీ, అంబారా, పఠాన్‌కోట్, జమ్మూ గుండా సాగి శ్రీనగర్‌లో ముగుస్తుంది. సెప్టెంబర్ 11న యాత్ర కేరళలో ప్రవేశిస్తుంది. రాష్ట్రంలో 18 రోజులు సాగాక సెప్టెంబర్ 30న కర్నాటకలోకి ప్రవేశిస్తుంది. 21 రోజుల అనంతరం వికారాబాద్ వద్ద తెలంగాణలోకి ప్రవేశించనుంది. యాత్రలో పాల్గొనేందుకు ఇప్పటిదాకా 50 వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment