-
రెజ్లింగ్‌లో ప్రతిభ చూపుతున్న వీవీఎస్ విద్యార్థులు
-
జాతీయ స్థాయికి ఎంపిక
బరిలోకి దూకి.. వారో పట్టు పట్టారంటే ప్రత్యర్థి మట్టి కరవాల్సిందే. పతకం వారి మెడలో చేరాల్సిందే.. యు.కొత్తపల్లి వీవీఎస్ పాఠశాల విద్యార్థులు రెజ్లింగ్(మల్లయుద్ధం)లో అసమాన ప్రతిభ చూపుతూ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వెన్నుతట్టి ప్రోత్సహించేవారుండాలే కానీ.. పతకాల పంట పండించడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కొత్తపల్లి :
మండల కేంద్రమైన కొత్తపల్లిలోని వీవీఎస్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు రెజ్లింగ్‌లో సత్తా చాటుతున్నారు. ఇక్కడ పదిమంది విద్యార్థులు రెజ్లింగ్‌లో శిక్షణ పొందుతుండగా.. వీరిలో ఎనిమిది మంది రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపారు. వారిలో ముగ్గురు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వచ్చే జనవరి నెలలో దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో వారు పాల్గోనున్నారు.
– ఈ పాఠశాల విద్యార్థి పి.సాయితేజ 2014లో మచిలీపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని స్వర్ణ పతకం సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. అలాగే 61వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్ పోటీల్లో రజత పతకం సాధించాడు. ఇటీవల కాకినాడలో జరిగిన సబ్ జూనియర్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించాడు. 42 కేజీల విభాగంలో జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు.
– మరో విద్యార్థి కె.సురేష్‌కుమార్ 2013లో రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో జరిగిన పోటీల్లోను, 2015లో మచిలీపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లోను స్వర్ణపతకాలు సాధించాడు. 2016లో రాష్ట్రస్థాయి 3వ సబ్ జూనియర్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున పాల్గొనేందుకు అర్హత సాధించాడు. అలాగే అనంతపురం, మచిలీపట్నం, కాకినాడల్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా స్వర్ణపతకాలు సాధించి, జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు.
– ఇదే పాఠశాలలో చదువుతున్న కె.సాయిగోపాల్ 2014, 2015 సంవత్సరాల్లో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో స్వర్ణపతకాలు సాధించాడు. ఇటీవల కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ పోటీల్లో ప్రతిభ చూపి జాతీయస్థాయికి ఎంపికయ్యాడు.
భారత్‌కు స్వర్ణం తేవడమే లక్ష్యం
భారత్ తరఫున ప్రపంచ రెజ్లింగ్ పోటీల్లో పాల్గొని స్వర్ణపతకం తేవడమే నా లక్ష్యం. నన్ను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంతో ప్రోత్సాహిస్తున్నారు.
– కె.సురేష్‌కుమార్, వీవీఎస్ విద్యార్థి
జాతీయస్థాయికి ఎంపికవడం ఆనందంగా ఉంది
జాతీయ రెజ్లింగ్ పోటీలకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభను చూపి, ఉన్న ఊరికి, చదువు చెప్పిన పాఠశాలకు పేరు తేవడమే నా ఆశయం.
– పి.సాయితేజ, వీవీఎస్ విద్యార్థి
తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం
జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికవడం వెనుక నా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఎంతో ఉంది. ముఖ్యంగా మా కోచ్ ఎంతో కృషితో మాకు శిక్షణ ఇచ్చారు.
– కేఎస్ గోపాల్, వీవీఎస్ విద్యార్థి
భారత్‌కు పేరు తేవడమే లక్ష్యం
నేను శిక్షణ ఇచ్చిన విద్యార్థులు జాతీయ స్థాయిక ఎంపిక కావడం సంతోషంగా ఉంది. భారత్ తరపున ఆడి ఇండియాకు పేరు తీసుకు రావాలన్నది నా లక్ష్యం. విద్యార్థులు ఎంతో పట్టుదలతో శిక్షణ పొందారు.
– పి.లక్ష్మణరావు, కోచ్