బీజేపీకి మాజీ ఎమ్మెల్యే యెన్నం రాజీనామా
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ మాజీ శాసనసభ్యుడు, బీజేపీ నేత యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గత సాధారణ ఎన్నికల తర్వాత పార్టీకి అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్న యెన్నం తన రాజీనామాను సోమవారమిక్కడ ప్రకటించారు. పార్టీ ద్వారా వచ్చిన అన్ని స్థాయిల్లోని బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డికి ఫ్యాక్సు ద్వారా రాజీనామా లేఖ పంపానని విలేకరులతో చెప్పారు. ఏ లక్ష్యాల కోసం తెలంగాణ సాధించామో వాటిని ఎవరూ పట్టించుకోవడంలేదని విమర్శించారు. అస్తవ్యస్త పాలన, లక్ష్యంలేని విధానాలను ఓ తెలంగాణ బిడ్డగా, ఉద్యమకారునిగా చూస్తూ కూర్చోలేక ప్రజాక్షేత్రంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.
‘ఒక కుటుంబపాలన బంగారు సంకెళ్ల నుంచి తెలంగాణ విముక్తి కోసం మరో పోరాటం అవసరం. 2001 నాటి పరిస్థితులే మరోసారి కొత్తరూపంలో తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నాయి. ఇప్పటిదాకా ప్రాంతేతరులపై ఎక్కుపెట్టిన ఉద్యమాస్త్రాన్ని ప్రాంతీయులపై సంధించాల్సిన సమయం ఇదే. విలువలతో కూడిన రాజకీయం కోసం, పేదల అవసరాలు తీర్చే పరిపాలనకోసం, స్థూలంగా మెజారిటీ ప్రజలకు అధికారం కోసం ఉద్యమిస్తా. దీనికోసం ప్రజావ్యతిరేక ప్రభుత్వపాలనపై వ్యక్తులుగా, సంఘాలు, సంస్థలుగా, పార్టీలుగా ఉన్న అందరినీ సమాయత్తపరిచే బాధ్యత తీసుకుంటున్నా’ అని యెన్నం వెల్లడించారు.
ఉద్యమ ఫలాలను అనుభవిస్తున్న ఉద్యోగసంఘాల నేతలు, పార్టీలన్నీ పోరాటయోధులను విస్మరిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ అమరులను బంగారు తెలంగాణ సాధన కార్యానికి విఘ్నేశ్వరుల్లాగా స్మరించుకోవాలన్నారు. తెలంగాణ రక్షణకోసం ప్రారంభిస్తున్న ఉద్యమంలో మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డితో పాటు చాలామంది నాయకులు ఉంటారని పేర్కొన్నారు.