రామాయంపేటలో యోగా ప్రదర్శనలో విద్యార్థులు
- జిల్లాకు ప్రత్యేక స్థానం
- రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ
- గ్రామాల్లో విస్తృతంగా శిబిరాల నిర్వహణ
రామాయంపేట: యోగాలో జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. గతంలో రాష్ట్ర స్థాయిలో యోగ పేరు చెబితేనే మెదక్ గుర్తుకువచ్చేది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో యోగాలో రాణించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వారిలో చాలామంది జిల్లాకు చెందినవారే ఉన్నారు. యోగ ప్రక్రియను సుమారుగా 37 ఏళ్ల క్రితం జిల్లాకు పరిచయం చేసింది తూప్రాన్‌కు చెందిన వంజరి రామచంద్రం మాస్టారు.
ఆయన కృషితో నేడు యోగ జిల్లాలో ఆదరణ పొందుతోంది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా యోగ పోటీలు నిర్వహిస్తే ఎన్నోసార్లు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. వరుసగా మెదక్ జిల్లా యోగాలో ఏడుసార్లు రాష్ట్రవ్యాప్తంగా ముందు వరుసలో నిలిపింది. రామచంద్రం, తోట సతీశ్, మాలతి, నవాత్ సురేశ్‌లాంటి వారు ఎందరో యోగాలో బంగారు పతకాలు సాధించి మన కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేశారు.
ప్రస్తుతం వారు గ్రామాల్లో విద్యార్థులకు యోగా ప్రక్రియలో శిక్షణ ఇస్తున్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, అన్ని రకాల వ్యాధులు నివారించవచ్చని సాధకులు చెబుతున్నారు. దీనికితోడు ప్రభుత్వం యోగాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో చాలామంది చూపు యోగా వైపు సారిస్తున్నారు. మంగళవారం రామాయంపేటలోని మంజీర విద్యాలయంలో స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగా పోటీలు జరిగాయి,. ఈపోటీలకు జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
యోగాకు ఆదరణ
సరిగ్గా 37 ఏళ్ల క్రితం యోగాను జిల్లాలో పరిచయం చేశాను. అప్పటినుంచి నిరంతరాయంగా దీనిని సాధన చేస్తున్నారు. నేడు ఎందరో యోగాలో ఉన్నత స్థాయికి ఎదిగి జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చారు. ప్రస్తుతం యోగాకు మంచి ఆదరణ లభిస్తుంది. దీనితో ఎన్నో లాభాలున్నాయి. దీనిని పాటిస్తే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో మేలు జరుగుతుంది. అన్ని రకాల వ్యాధులకు యోగాతో పరిష్కారం లభిస్తుంది. - రామచందర్, యోగ గురువు, ఫౌండర్
సంపూర్ణ ఆరోగ్యం
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. జిల్లా వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుంది. ప్రజలు స్వచ్ఛందంగా యోగ ఆచరిస్తున్నారు. నేటి పరిస్థితుల్లో యోగ సాధన ఎంతో అవసరం. యోగ క్రీడాకారులకు ప్రభుత్వం ఉద్యోగాలు, ఇతర నియామకాల్లో రిజర్వేషన్ సదుపాయం కల్పించాలి. యోగాను ప్రభుత్వం ఆదరిస్తే మంచి సమాజాన్ని తయారు చేయవచ్చు. - తోట సతీశ్, జాతీయ అవార్డు గ్రహీత
భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానం
మన సంస్కృతి, సంప్రదాయాల్లో యోగాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈమేరకు ప్రభుత్వాలు యోగాపట్ల ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి సైతం యోగాను గుర్తించి దాని అభివృద్ధికి చొరత చూపుతుండటం గొప్పవిషయం. యోగ ఆరోగ్యానికి మంచిది. నేడు చాలామంది సాధన చేస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. - పి మధుసూదన్‌రెడ్డి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి
రోజూ యోగా చేస్తా
ప్రతిరోజూ యోగా చేస్తాను. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా భువనగిరి, వనపర్తి తదితర పట్టణాల్లో యోగ పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్స్ సాధించాను. తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ముందుకెళుతున్నాను. జాతీయ స్థాయిలో రాణించడంతోపాటు మా గురువులకు మంచిపేరు తీసుకురావడానికి కృషి చేస్తున్నాను. - శివ, 7వ తరగతి, తునిఖి రెసిడెన్షియల్ విద్యార్థి
ఏకాగ్రత పెరుగుతుంది
నాలుగైదేళ్లుగా యోగా ఆసనాలు వేస్తున్నాను. దీంతో నాలో ఏకాగ్రత పెరుగుతోంది. గుజరాత్, మహారాష్ట్ర, తదితర రాష్టాల్లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని మంచి ప్రతిభ కనబర్చాను. గతంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించాను.అందరి సహకారంతోనే నేను యోగాలో రాణిస్తున్నాను. - భానుప్రకాశ్, 9వ తరగతి, చేగుంట జడ్పీహెచ్‌ఎస్
మాస్టర్ అవుతా
గతంలో నిజామాబాద్, నల్లగొండ, హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి యోగ పోటీలో పాల్గొని ప్రతిభ కనబర్చినందుకుగాను ఎన్నో అవార్డులు వచ్చాయి. యోగా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. మనస్సు మన ఆధీనంతో ఉండటంతోపాటు చదివింది మంచిగా అర్థమవుతుంది. యోగా మాస్టర్‌ను కావాలని ఉంది. - ప్రత్యూష, 9వ తరగతి, మెదక్ బాలికల రెసిడెన్షియల్ స్కూలు
జాతీయస్థాయి పోటీలకు అర్హత
యోగ ఆసనాలు ప్రతిరోజూ వేస్తున్నాను. మంచి ఫిట్‌నెస్ సాధ్యపడుతుంది. చదువుపై ఆసక్తి పెంపొందుతుంది. ఇటీవల నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాను. ఇందుకుగాను టీచర్లు ఎంతో సహకరించారు. - లావణ్య, విద్యార్థిని, మెదక్ బాలికల రెసిడెన్షియల్ స్కూలు
జాతీయ స్థాయిలో రాణిస్తా
యోగాలో జాతీయ స్థాయిలో రాణించాలన్నదే నాఆశయం.ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో శిక్షణ పొందుతున్నాను. జాతీయ యోగ దినోత్సవం రోజున సిద్దిపేటలో యోగా ప్రదర్శన ఇచ్చి అందరి మెప్పు పొందాను. అందరూ ప్రాక్టీస్ చేస్తే మరింతగా బాగుంటుంది. - సింధూరి, 9వ తరగతి, మర్పడగ జడ్పీహెచ్‌ఎస్