చంద్రబాబూ మీకా అర్హత లేదు.. | You dont have that right chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ మీకా అర్హత లేదు..

Published Wed, Mar 30 2016 1:56 AM | Last Updated on Mon, Oct 29 2018 8:08 PM

చంద్రబాబూ మీకా అర్హత లేదు.. - Sakshi

చంద్రబాబూ మీకా అర్హత లేదు..

టీడీపీ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొనడంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ధ్వజం

♦ ఎన్టీఆర్ సిద్ధాంతాలకు సమాధి కట్టారు
♦ మీ కొడుకు ఎదగకుండా పోతాడని జూనియర్ ఎన్టీఆర్‌ను తరిమేశారు
 
 సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ ఆవిర్భావ దినోత్సవాల్లో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పాల్గొనడాన్ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా తప్పుపట్టారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, పిల్లనిచ్చిన మామ అయిన ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి.. ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొనే హక్కు ఉందా? అని ఆమె ప్రశ్నించారు. రోజా మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘1982 మార్చి 29న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారు. తన సొంత రెక్కల కష్టంతో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే ఆయనకు ఏవిధంగా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారో అందరికీ తెలిసిందే..’ అని రోజా అన్నారు.

‘అధికారంలోకి వచ్చేందుకు ఎన్టీఆర్ పేరును, ఆయన కుటుంబసభ్యులను చంద్రబాబు వాడుకుంటారు. అధికారంలోకి వచ్చాక వదిలేస్తారు. పురందేశ్వరి, బాలకృష్ణ, హరికృష్ణను ఏవిధంగా వాడుకుని ఆ తర్వాత పక్కన పెట్టారో తెలిసిందే. ఎన్టీఆర్ సిద్ధాంతాలకు, ఆశయాలకు చంద్రబాబు సమాధి కట్టారని రోజా విమర్శించారు. ఎవరైనా తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకుంటే తమ పదవులకు ముందే రాజీనామా చేసి రావాలని పార్టీ మొదటి మహానాడు (1982)లోనే ఎన్టీఆర్ తీర్మానం చేశారని రోజా తెలిపారు. ఇప్పుడదే పార్టీని నడుపుతూ సిగ్గులేకుండా, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయకపోయినా సంతలో పశువులను కొన్నట్టు వారిని కొంటున్న చంద్రబాబుకు ఈరోజు టీడీపీ జెండా ఎగురవేసే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు.

 కొడుకు కోసం జూ.ఎన్టీఆర్‌ను తరిమేశారు
 జూనియర్ ఎన్టీఆర్ చరిష్మా ముందు తన కుమారుడు పప్పుసుద్దగా మిగిలిపోతాడని, ఎదగకుండా పోతాడనే భయంతో జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోంచి తరిమివేశారని, ఆయన సినిమాలు విడుదల కాకుండా చూస్తున్నారని రోజా విమర్శించారు. ఈరోజు ఉన్నది టీడీపీ కాదని, తెలుగు దొంగల పార్టీ అని ఆమె ఎద్దేవా చేశారు. నిన్నటివరకు ఎదురుచూసినా ప్రివిలేజ్ కమిటీ నుంచి పిలుపు రానందుకే సుప్రీంకోర్టుకు వచ్చానని రోజా తెలిపారు.
 
 సుప్రీంకోర్టులో రోజా పిటిషన్
 వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను అసెంబ్లీకి హాజరయ్యేలా అవకాశం కల్పిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై.. డివిజన్ బెంచ్ ఇచ్చిన స్టే ఉత్తర్వులను రద్దు చేయాలని ఆమె కోరారు. ఈ మేరకు మంగళవారం ఉదయం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. తాము స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తున్నామని, ఇందుకు అనుమతించాలని రోజా తరఫు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్.. ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. హైకోర్టు న్యాయమూర్తి తమకు అనుకూలంగా 22 పేజీలతో కూడిన ఉత్తర్వులు వెలువరించారని, ఏడాదిపాటు సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని కూడా వ్యాఖ్యానించారని పిటిషన్‌లో వివరించారు. దీనిపై శుక్రవారం (ఏప్రిల్ 1న) విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement