పంట కాలువలో దంపతుల గల్లంతు
పంట కాలువలో దంపతుల గల్లంతు
Published Sun, Aug 13 2017 11:14 PM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM
కాలువలో దూకేసిన భార్య
ఆమెను రక్షించేందుకు భర్త ..
కొత్తపేట : కులాంతర వివాహం చేసుకున్నారు. ఎలాంటి పొరపచ్చాలు లేకుండా హాయిగా జీవనం సాగిస్తున్నారు. ఏ కష్టం వచ్చిందో ఏమో కానీభార్య కాలువలోకి దూకేయగా ఆమెను రక్షించబోయి భర్త తమ కుమార్తెను వదిలేసి కాలువలోకి దూకాడు. ఇద్దరూ గల్లంతయ్యారు. కొత్తపేట మండలం కండ్రిగ గ్రామానికి చెందిన కముజు శ్రీనివాసరావు (29), భవాని (26) దంపతులు బిళ్లకుర్రు శివారు డేగలవారిపాలెం వంతెన వద్ద భార్యా భర్తలు పంట కాలువలోకి దూకి గల్లంతయ్యారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి తండ్రి రాంబాబు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కండ్రిగ శివారు గుబ్బలవారిపాలెం గ్రామానికి చెందిన కముజు రాంబాబు – పుష్పకుమారి దంపతులకు కుమారుడు శ్రీనివాసరావు, ఒక కుమార్తె ఉన్నారు. శ్రీనివాసరావు సుమారు ఆరేళ్ల క్రితం అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం గ్రామానికి చెందిన భవాని అనే యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడు. వారికి పాప జన్మించింది. ప్రస్తుతం నాలుగేళ్ల కుమార్తె చెవిటి, మూగ, నడవలేని దివ్యాంగురాలు. శ్రీనివాసరావు ప్రస్తుతం రావులపాలెంలో ఒక ప్రైవేట్ స్కూలులో పీఈటీగా పనిచేస్తున్నాడు.
పెళ్లికి బయలుదేరి...
ఇదిలా ఉండగా గ్రామంలో మట్టపర్తి సింహాచలం కుమార్తె వివాహం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం విందు కార్యక్రమంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అమలాపురంలో పెళ్లి కుమారుని ఇంటి వద్ద వివాహం కార్యక్రమానికి కుమార్తెను తీసుకుని భార్యాభర్తలిద్దరూ మోటార్ సైకిల్‌పై రాత్రి ఏడు గంటల సమయంలో ఇంటి నుంచి బయలుదేరారు. సమీనపంలోని డేగలవారిపాలెం వంతెన వద్దకు వెళ్లేసరికి ఏమైందో ఏమో గాని భార్య భవాని మోటార్ సైకిలు దిగి పరుగెత్తగా భర్త శ్రీనివాసరావు బండి స్టాండ్ వేసి కుమార్తెను మోటార్ సైకిల్‌పైనే ఉంచి ఆమె వెంట పరుగెట్టాడు. ఆమె గట్టుపై చెప్పులు వదిలేసి బొబ్బర్లంక–అమలాపురం కాలువలో దూకేసింది. ఆమెను రక్షించేందుకు అతనూ దూకేవాడు. కాలువ అవతల ఉన్న వారు ఎవరో కాలువలో దూకేశారని గ్రహించి కేకలు వేయగా ఆ సమీపంలో నివాసితులు వాకాడ శ్రీనివాసరావు, వాకాడ శేషగోవిందరావు సంఘటనా స్థలానికి చేరుకోగా అక్కడ ఎవరూ కనిపించలేదు. సమీపంలో మోటార్‌సైకిలు, దానిపై ఒక పాప ఉంది.అక్కడ సెల్‌ఫోన్ పడివుంది. అదే సమయంలో గుబ్బలవారి పాలెంకు చెందిన ఓ వ్యక్తి అటు వెళుతూ ఆ పాపను గుర్తించి తన వెంట తీసుకువెళ్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు అప్పగించాడు. గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలిస్తున్నారు. కొత్తపేట ఎస్సై డి.విజయకుమార్, ఏఎస్సై ఎ.గరగారావు సంఘటనా స్థలాన్ని సందర్శించారు.
దివ్యాంగ కుమార్తే కారణమా ?
కుమార్తె దివ్యాంగురాలు కావడంతో నిత్యం ఆ దంపతులు మదన పడేవారు. పలుమార్లు కుమార్తెతో కాలువలో పడి ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు. వారి మాటలు విన్న అతడి తల్లిదండ్రులు వారించి అటువంటి పని చేయకండి..వైద్యం చేయిస్తున్నారు కదా..ఆరోగ్యవంతురాలు అవుతుందిలే అని నచ్చచెప్పేవారు. ఆమె అఘాయిత్యానికి పాల్పడగా ఆమెను రక్షించేందుకు వెళ్లి గల్లంతయ్యాడని అతడి తండ్రి రాంబాబు కన్నీటి పర్యతమయ్యాడు.
Advertisement