ఎస్కీలో పామును పట్టుకుంటున్న నిఖిల
రాయదుర్గం: గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఎస్కీ)లోని పాత క్యాంటీన్ భవనం వద్ద ఉన్న చెట్ల పొదల్లో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు తోటమాలికి తాచుపాము కనిపించింది. సమాచారం అందుకున్న ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ సభ్యురాలు, బ్యాచిలర్ ఆఫ్ హార్టికల్చర్ విద్యార్థిని నిఖిల తోటి సభ్యులు నిఖిల్, భావనారెడ్డితో కలిసి ఎస్కీకి చేరుకున్నారు.
పొదల్లో దాక్కున్న పామును నిఖిల ఇనుప చువ్వ సహాయంతో ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతో ఎస్కీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. నిఖిల ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ ఆరు నెలల పాటు పాములను పట్టుకోవడం, వాటిని సురక్షిత ప్రాంతాల్లో విడిచి పెట్టడంపై శిక్షణ పొందారు. ఎవరికైనా పాము కనిపిస్తే సైనిక్‌పురిలో ఉన్న తమ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ హెల్ప్‌లైన్ నెం. 8374233366కు ఫోన్ చేస్తే.. తమ సభ్యులు వచ్చి వాటిని పట్టుకుంటారని నిఖిల, నిఖిల్, భావనారెడ్డి తెలిపారు.