జిమ్‌జిమ్‌ జిగాజిగా | youth take care on body fitness | Sakshi
Sakshi News home page

జిమ్‌జిమ్‌ జిగాజిగా

Published Sat, Sep 9 2017 11:24 PM | Last Updated on Sun, Sep 17 2017 6:39 PM

జిమ్‌జిమ్‌ జిగాజిగా

జిమ్‌జిమ్‌ జిగాజిగా

బాడీ బిల్డింగ్‌పై ఆసక్తి చూపుతున్న యువత 
మహిళలు, పెద్దవాళ్లు సైతం వ్యాయామంపై శ్రద్ధ 
జిల్లాలో పెరుగుతున్న జిమ్‌ల సంఖ్య 
 
 
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో తిన్నది ఒంట బట్టాలన్నా.. ఒంట బట్టింది.. కండగ మారాలన్న  జిమ్‌కు వెళ్లాలి. గంటల తరబడి కసరత్తులు చేస్తూ చెమటలు చిందించాలి. అప్పుడే ఆరోగ్యానికి ఆరోగ్యం.. కండకు కండ.. అందుకే ఏనాడో ఓ మహాకవి అన్నాడు.. ’తిండి కలిగితే  కండ కలదోయ్‌.. కండ కలవాడేను మనిషోయ్‌..’ అని.. భీమవరం 
 
జిల్లా వ్యాప్తంగా దేహదారుఢ్యం, ఆరోగ్య రక్షణపై ఇటీవల అన్నివర్గాల ప్రజలు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. నియమిత ఆహారం భుజిస్తూ వాకింగ్, రన్నింగ్, షటిల్‌ ప్రాక్టీసు వంటి వాటితో పాటు అనేక మంది జిమ్ముల్లో కసరత్తులు చేస్తున్నారు. మరికొంతమంది యువకులు దేహదారుఢ్యాన్ని పెంచుకుని ఉద్యోగావకాశాల కోసం  బాడీబిల్డింగ్‌లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిజికల్‌ ఫిటినెస్, ఫిటినెస్‌ మోడలింగ్‌ కోసం ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ జిమ్‌ల నిర్వహణ పెరుగుతోంది. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కోసం ఇటీవల కాలంలో మహిళలు కూడా జిమ్‌ గుమ్మం తొక్కుతున్నారంటే వీటి ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు. మహిళలు ఊబకాయం తగ్గడానికి, ప్రసవానంతరం ఉదరభాగం తగ్గించుకోవడానికి, కండరాలు గట్టిపడడానికి జిమ్‌ల్లో శిక్షణ పొందుతున్నారు. 
జిల్లాలో 50 వరకు జిమ్‌లు 
జిల్లావ్యాప్తంగా ఏలూరు నగరంలో దాదాపు 15 జిమ్‌లు నిర్వహిస్తుంటే భీమవరంలో 7, పాలకొల్లు, నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు, ఆకివీడు, తణుకు, పట్టణాల్లో రెండేసి జిమ్‌లు, ఉండి, వీరవాసరం, పెన్నాడ, జంగారెడ్డిగూడెం తదితర  ప్రాంతాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.
80 మంది బాడీబిల్డర్లు
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 80 మంది బాడీబిల్డర్లు ఉన్నారు. వీరంతా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని బాడీబిల్డింగ్‌ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించి తమ సత్తాచాటారు. వీరిలో 30 మంది బాడీ బిల్డర్లు భీమవరం పట్టణంలో షేక్‌ ఖాశీం నిర్వహిస్తోన్న అలర్ట్‌ జిమ్‌లో శిక్షణ పొందుతున్నవారే కావడం విశేషం. వీరిలో ఎక్కువ మంది బాడీబిల్డింగ్‌పై ఉన్న మక్కువతో ప్రత్యేక శిక్షణ పొందుతుండగా మరికొంతమంది ఉద్యోగాల్లో బాడీబిల్డర్స్‌కు ప్రత్యేకంగా రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించడంతో నిరుద్యోగులు బాడీబిల్డింగ్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. దీనికి తోడు రాష్ట్రవ్యాప్తంగా బాడీబిల్డింగ్‌ పోటీలు నిర్వహించి పెద్ద మొత్తంలో బహుమతులు ఇవ్వడం విశేషం.
ప్రత్యేక పోషకాహారం తప్పనిసరి 
బాడీబిల్డింగ్‌లో పోటీలంటే మామూలు విషయం కాదు. దీనిలో శిక్షణ పొందేవారు ప్రత్యేక పోషకాహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఖర్చుతో కూడినదైనా కొంతమంది యువకులు తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఎక్కడో ఒక చోట పనిచేసుకుంటూ దానిపై వచ్చే ఆదాయంతో ఆహారానికి ఖర్చు చేస్తున్నారు.  ప్రధానంగా బాడీ బిల్డింగ్‌ పోటీలకు హాజరయ్యేవారు పోటీలకు ముందుగా రోజుకు 20 కోడి గుడ్లు, అర లీటరు పాలు, అరకిలో చికెన్‌ వంటివి తప్పనిసరిగా తీసుకోవాలి. ఫిట్‌నెస్‌ కోసమైతే రోజుకు నాలుగు గుడ్లు, గ్లాసు పాలు, డ్రైప్రూట్స్, చిలకడదుంపలు, సోయాబీన్స్, శెనగలు, పెసలు, బొబ్బర్లు, ఉడకబెట్టిన చికెన్, మొలకెత్తిన విత్తనాలు ఆహారంగా తీసుకోవాలి. ప్రత్యేక ఆహారానికి రోజుకు రూ.200 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.
 
చిన్నప్పటి నుంచి ఆసక్తి 
బాడీ బిల్డింగ్‌ వైపు మళ్లడానికి నా తండ్రి షేక్‌ మీరా సాహెబ్‌ స్ఫూర్తి. నా చిన్నతనంలో ఆయన ఎక్సెర్‌సైజ్‌లు చేస్తుండగా చూస్తూ స్ఫూర్తిని పొందా. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో మిస్టర్‌ ఆంధ్రా కైవసం చేసుకున్నా. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఆలిండియా బాడీ బాల్డింగ్‌ పోటీల్లో బెస్ట్‌ ఆఫ్‌ సిక్స్‌లో స్థానాన్ని సొంతం చేసుకున్నా.  మిస్టర్‌ ఆంధ్రా టైటిల్‌ నాలుగు పర్యాయాలు గెలుచుకున్నా. బ్యాంకాక్‌లో జరిగిన ప్రపంచ స్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీల్లో జడ్జిగా వ్యవహరించా. ప్రస్తుతం ఆంధ్రా బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌కు జాయింట్‌ సెక్రటరీగా, జిల్లా కార్యదర్శిగాను కొనసాగుతున్నాను. బాడీబిల్డింగ్‌లో మరింత మందిని తీర్చిదిద్దాలనే జిమ్‌ నిర్వహిస్తున్నా.
: షేక్‌ ఖాసీం, అలర్ట్‌ జిమ్‌ నిర్వాహకుడు, భీమవరం
 
హోటల్‌లో పనిచేస్తూ శిక్షణ 
నేýను పదో తరగతి వరకు చదువుకున్నా. ఐదేళ్లుగా జిమ్‌లో శిక్షణ పొందుతున్నా. ప్రస్తుతం ఒక హోటల్‌లో పనిచేస్తూ ఖాళీ సమయంలో శిక్షణ పొంది బాడీ బిల్డింగ్‌ పోటీల్లో మిస్టర్‌ ఆంధ్ర వంటి టైటిళ్లు సాధించాను. 
: ముడి చిన్నా, భీమవరం
 
ఐదుసార్లు ప్రథమస్థానంలో నిలిచా
ఎనిమిదేళ్ల క్రితం ఒరిస్సా నుంచి జీవనోపాధి కోసం ఇక్కడికి వచ్చా. ఒక హోటల్‌లో చెప్‌గా పనిచేస్తూ బాడీబిల్డింగ్‌లో శిక్షణ పొందుతున్నా. 85 కిలోల విభాగంలో ఏలూరు, భీమవరం, పాలకొల్లులో నిర్వహించిన పోటీల్లో ఐదు సార్లు జిల్లాస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచా.
 ఎండీ సలీమ్, ఒడిశా 
 
బాడీబిల్డింగ్‌ అంటే ఎంతో ఇష్టం 
బాడీబిల్డింగ్‌ అంటే ఎంతో ఇష్టం. గత ఏడాదిగా అలర్ట్‌ జిమ్‌లో శిక్షణ పొందుతున్నా. కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ను ఆదర్శంగా తీసుకుని కండలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నా. విజయవాడ, భీమవరం జరిగిన పోటీల్లో బహుమతులు పొందా.
 రియాజ్‌ ఉద్దీన్‌ ఆహ్మద్, భీమవరం
 
ఉద్యోగం సంపాదించడమే లక్ష్యం
పదో తరతగతి వరకు చదువుకున్నా. ఆర్థిక స్థోమత లేక చదువును కొనసాగించలేకపోయా. బాడీ బిల్డింగ్‌ ద్వారా రిజర్వేషన్‌ ఖాతాలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంలో జిమ్‌లో చేరా. ప్రస్తుతం కారు డ్రైవర్‌గా పనిచేస్తూ వస్తోన్న సొమ్ముతో బాడీబిల్డింగ్‌ కోసం రోజుకు రూ.100 ఖర్చు చేస్తున్నా. 
: కె.సతీష్, మహాదేవపట్నం
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement