
వెటర్నరీ విద్యార్థులకు వైఎస్ జగన్ మద్దతు
విజయవాడ: పశు వైద్య కేంద్రాలను పశువైద్యశాలలుగా మార్చాలని డిమాండ్ చేస్తూ రిలే దీక్షలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్దతు తెలిపారు. శుక్రవారం గుంటూరు జిల్లా పర్యటనలో వెళుతున్న ఆయన వెటర్నరీ కళాశాల వద్ద విద్యార్థుల దీక్ష శిబిరాన్ని సందర్శించారు. జీవో నెంబర్ 97లో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ పశువైద్య విద్యార్థులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం సంచార పశువైద్యం కోసం ప్రైవేటు నియామకాలు జరుపుతామని ప్రకటిస్తూ జీవో నెంబరు 97 విడుదల చేయటాన్ని వ్యతిరేకిస్తూ వారు దీక్షలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ చంద్రన్న సంచార పశు వైధ్యపథకంలో కాంట్రాక్ట్ పద్ధతుల్లో కాకుండా శాశ్వత పద్ధతుల్లో పశువైద్యులను నియమించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు చేస్తున్న డిమాండ్లు న్యాయబద్ధమైనవన్నారు. ఆర్ఎల్యూలను వీడీలుగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. సంచార పశు వైద్యశాలల్లో కాంట్రాక్టు నియామకాల్ని వ్యతిరేకిస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. జీవో నెంబరు 97 రద్దు చేయాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తామన్నారు.
మున్సిపాలిటీల్లో జంతువుల ద్వారా వచ్చే వ్యాధులను అరికట్టేందుకు పశువైద్యులు క్రియాశీలక పాత్ర పోసిస్తారన్నారు. ఇన్ని రోజులుగా దీక్ష చేస్తున్నా విద్యార్థుల ఆందోళనపై చంద్రబాబు స్పందించకపోవడం దారుణమన్నారు. చంద్రబాబు హయాంలో న్యాయం జరగకుంటే వచ్చేది వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వమేనని, తప్పక న్యాయం చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అప్పటివరకూ విద్యార్థులకు పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు.