'చంద్రబాబుకు జాబొచ్చింది.. మనకేది'
కాకినాడ: ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ లో అందరి జీవితాలు బాగుపడతాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ విషయం తెలిసి కూడా ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం కాకినాడ కలెక్టరేట్ వద్ద మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో పాల్గొన్న వైఎస్ జగన్ మాట్లాడారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా ప్రజలు ప్రత్యేక హోదా కోసం ఉద్యమబాట పట్టారని ఆయన అన్నారు.
ఉద్యోగాలు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్న, యువత జీవితాలు బాగుపడాలన్న ప్రత్యేక హోదా అవసరం అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పిన చంద్రబాబు ఎన్నికల అనంతరం పంగనామాలు పెట్టారని ఆయన విమర్శించారు. జాబు రావాలంటే బాబు రావాలని ఎన్నికల సందర్భంలో చెప్పిన చంద్రబాబు తనకు ముఖ్యమంత్రి ఉద్యోగం వచ్చాక అన్నీ మరిచిపోయారని, రాష్ట్రంలో ఉన్నవారిని నిరుద్యోగులుగా మిగిల్చారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఇక నిరుద్యోగ భృతి విషయంలో కూడా మోసం చేశారని అన్నారు. చంద్రబాబు అన్ని కులాల వారిని వంచించారని, కులాలు, మతాల పేరిట విభజన రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు.