రేణిగుంట విమానాశ్రయం వద్ద వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలుకుతున్న నేతలు, కార్యకర్తలు
– వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఘనస్వాగతం
– మీ వెంట నేనుంటానంటూ మహిళలకు జగనన్న భరోసా
తిరుపతి మంగళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ప్రత్యేక హోదా సాధనకోసం నెల్లూరులో నిర్వహిస్తున్న యువభేరిలో పాల్గొనేందుకు గురువారం ఉదయం ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యేలు కళత్తూరు నారాయణస్వామి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, సునీల్‌కుమార్, నియోజకవర్గ సమన్వయకర్తలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి(శ్రీకాళహస్తి), ఆదిమూలం(సత్యవేడు, రాకేష్‌రెడ్డి(పలమనేరు), పార్టీ రాష్ట్ర నాయకులు పెంచలయ్య(తిరుమల), నెల్లూరు జిల్లా నాయకులు కళివేటి సంజీవయ్య, మేకపాటి గౌతంరెడ్డి, కాకాని గోవర్ధన్‌రెడ్డి, కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి పుష్పగుచ్ఛాలు అందించి, దుశ్శాలువలు కప్పి ఆత్మీయంగా సత్కరించారు. జగన్‌మోహన్‌రెడ్డి విమానాశ్రయానికి చేరుకోగానే అప్పటికే అక్కడున్న అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్లకార్డులు పట్టుకుని జై జగన్..జై జగన్.. అంటూ నినాదాలు చేశారు. నాయకులను, కార్యకర్తలను ఆయన పేరు పేరునా పలకరించారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి నిరంతరం ప్రతిఒక్కరు కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధన కోసం యువత ఉద్యమించాల్సిన అవసరం ఉందని యువతకు సూచించారు. అక్కడి నుంచి జగన్‌మోహన్‌రెడ్డి రోడ్డు మార్గంలో నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యంలో శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ కూడలి వద్ద ఆయనకు బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, రైతులు, అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. జననేతకు స్వాగతం పలికినవారిలో మహిళా విభాగం జిల్లా, నగర అధ్యక్షులు గాయత్రీదేవి, చెలికం కుసుమ, తిరుపతి నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, వైఎస్సార్ టీయూసీ జిల్లా, నగర అధ్యక్షులు బీరేంద్రవర్మ, పుల్లూరు అమరనా«థ్‌రెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు టి.రాజేంద్ర, గఫూర్, రవిచంద్ర, మురళి, ఓబుల్‌రెడ్డి, సురేష్‌నాయక్, నాయకులు మాదవనాయుడు, రామూర్తి, మురళి, యువత ఉన్నారు.
మీ వెంట నేనుంటా
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం మంగళవారం తిరుపతిలో నిర్వహించిన బంద్‌లో మహిళలపై పోలీసులు చేసిన పైశాచిక దాడులకు గురైన శాంతమ్మ, రమణమ్మ, లక్ష్మి, పుష్పాచౌదరి, మునీశ్వరి, పుష్పలత, శారద, గీతాయాదవ్, శ్యామల, సాయికుమారి, పుణీత, కెఆర్.సుశీల, దుర్గ, భారతిలను రేణిగుంట విమానాశ్రయంలో జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. మీ వెంట నేనుంటానంటూ మహిళలకు భరోసా ఇచ్చారు. పోలీసుల చేతుల్లో పైశాచిక దాడులకు గురైన మహిళలు సిగ్గుపడాల్సిన అవసరం లేదని, మహిళల చీరలను చింపి, తాళిబొట్టులను తెంపించిన చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడం కోసం తమ ప్రాణాలనైనా అర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని మహిళలు జననేతకు తెలిపారు.