ప్రతి హృదయం..వైఎస్ స్మృతివనం
♦ జిల్లాపై చెరగని ‘రాజ’ ముద్ర
♦ వైఎస్ మరణంతో నిలిచిపోయిన అభివృద్ధి
♦ పేదల గుండెల్లో ఆయన స్థానం శాశ్వతం
♦ పెద్దాయన పంథాలో యువనేత జగన్
పేదోడికి జబ్బు చేస్తే ఆరోగ్యశ్రీ పథకమంటూ హృదయంతో మందు వేసిన నీ పేద్ద మనసుని చూసి ప్రతి హృదయం సంబరపడింది.
ముదిమి వయసులో ముద్దలేక అల్లాడుతున్న అవ్వ, తాతలకు పింఛన్‌తో పరమాన్నం పెట్టిన నీ ఔదార్యాన్ని చూసి పండుటాకు పొంగిపోయింది.
పరుగులు పెడుతున్న జీవనదులను జలయజ్ఞంతో కట్టేసి..బీడుభూముల్లో రతనాల పంటలు పండించిన నీ మహాయజ్ఞానికి కర్షకలోకం ఆనందంతో ఉరకలెత్తింది.
ప్రతిభకు పేదరికం అడ్డుకాకూడదని ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంతో విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేసిన నీ తేనె హృదయాన్ని చూసి యువతరం మురిసిపోయింది.
ఇలా నీ జ్ఞాపకాలను గుండె గుడిలో దాచుకున్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు మనసున్న మారాజు మా రాజశేఖరుడు ఎప్పుడొస్తాడని.. శనివారం జయంతి వేళ తమ నవ్వుల రేడును మనసారా మరొక్కసారి చూడాలని..
సాక్షి, గుంటూరు: రాజకీయ రాజధాని గుంటూరు జిల్లాపై దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముద్ర సుస్పష్టం. ఉనికిని కోల్పోయి చుక్కాని లేని నావలా మారిన గుంటూరు జిల్లాకు రాజన్న రాజకీయ ఉన్నతి కల్పించారు. సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో ఆ పార్టీ అడ్రస్ గల్లంతయ్యేలా చేశారు. 2004లో దివంగత వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. కర్త, కర్మ, క్రియ అన్నీ తానై వ్యవహరించి జిల్లాలో 19 నియోజకవర్గాల్లో 18 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందేలా రాజకీయ చతురత చూపించారు.తదనంతరం ప్రభుత్వ కూర్పులోనూ జిల్లాకు పెద్ద పీట వేసి నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. 2009 ఎన్నికల్లోనూ అదే ప్రభంజనం కొనసాగించారు.
అయితే దురదృష్ట పరిణామాల నేపథ్యంలో ఆయన మరణించడంతో జిల్లాలో రాజకీయ పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. అప్పటి వరకు వెన్నంటే నిలిచి అనేక పదవులు పొందిన నేతలు విశ్వాసఘాతకులుగా మారారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలను చూసిన ప్రజలు మాత్రం మహానేతను గుండెల్లో గూడు కట్టుకుని దైవంగా ఆరాధిస్తున్నారు. మహానేత బాటలోనే ఆయన తనయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పయనిస్తూ జిల్లా ప్రజలతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు.
జిల్లా నుంచే పథకాలకు శ్రీకారం
ఐదేళ్ల పదవీ కాలంలో దివంగత మహానేత జిల్లాకు 57 పర్యాయాలు వచ్చారు. రాజీవ్ పల్లెబాట, ఇందిర ప్రభ, పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ఇలా అనేక కార్యక్రమాలు ఇక్కడే నిర్వహించారు. ఏడాదికి సగటున పది సార్లు మహానేత జిల్లాలో పర్యటించారు. ఇందిర ప్రభ, ఇందిరమ్మ ఇళ్లు లాంటి సంక్షేమ కార్యక్రమాలకు జిల్లాలోనే శ్రీకారం చుట్టారు. ఇక్కడ వందలాది మంది కార్యకర్తలను నేతలుగా తీర్చిదిద్దిన ఘనత దివంగత రాజశేఖరుడిదే. దాదాపుగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభిమానులు, అనుచరులు ఉన్న ఏకైక నేతగా, నిత్యం ప్రజల సంక్షేమ కోసం పరితపించిన అనురాగమూర్తిగా ఆయన ఎన్నటికీ చిరస్మరణీయుడే.
వైఎస్ మరణంతోనే ఆగిన అభివృద్ధి
దివంగత మహానేత మరణంతోనే జిల్లాలో అభివృద్ధి కొండెక్కింది. ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, ఇందిర ప్రభ ఇలా అన్ని కార్యక్రమాలు కోతలు, కత్తెరింపులతో కాగితాలకే పరిమితమై లబ్ధిదారులకు దూరంగా వెళ్లిపోయాయి. ప్రధానంగా జిల్లా ప్రజలకు చిరకాల స్వప్నంగా నిలిచిపోయిన పులిచింతల ప్రాజెక్టును సాకారం చేసింది మహానేతే. అనేక అడ్డంకులు అవరోధాలు దాటుకుని ముఖ్యమంత్రి అయిన వెంటనే 2004 అక్టోబరు 15న రూ. 682 కోట్ల వ్యయంతో పులిచింతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. తనదనంతరం పర్యావరణ అనుమతులు లేక ప్రాజెక్టు నిలిచిపోతే ప్రత్యేక దృష్టి సారించారు. పర్యావరణ అనుమతులు సాధించి 2005 జూన్‌లో పనులను ప్రారంభించి ప్రతి నెలా అభివృద్ధిపై సమీక్షించారు.
దివంగత వైఎస్సార్ ఐదేళ్ల పాలనలో ఇందిరమ్మ ప్రభ పథకం ద్వారా 12 వేల ఎకరాల భూ పంపిణీ చేయగా, ఆయన మరణంతో పథకమే పూర్తిగా అటకెక్కింది. దుర్గిలో మిర్చి మార్కెట్ యార్డును నిర్మించాలని యోచించి నిధులు మంజూరు చేశారు. అయితే స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైఎస్సార్ సీపీలో ఉండటంతో గత కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం దాని ఊసే ఎత్తడం లేదు. జిల్లాలో మొత్తం 2.26 లక్షల ఇళ్లు మంజూరు కాగా 1.49 లక్షల ఇళ్లు వైఎస్ పాలనలోనే పూర్తయ్యాయి. మిగిలినవి నేటికీ నిర్మాణ దశల్లోనే ఉండగా, కొత్త ఇల్లు ఒక్కటీ మంజూరు కాలేదు. ఆరోగ్యశ్రీ పథకాన్ని 2008లో జిల్లాలోని సాయిభాస్కర్ ఆసుపత్రిలో రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 2010 చివరి వరకు 14 లక్షలకు పైచిలుకు ఆపరేషన్లు నిర్వహించారు. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నీరుగార్చేసింది.