హర్తాళ్‌ సక్సెస్‌ | yscp harthal success | Sakshi
Sakshi News home page

హర్తాళ్‌ సక్సెస్‌

Published Mon, Nov 28 2016 11:11 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

హర్తాళ్‌ సక్సెస్‌ - Sakshi

హర్తాళ్‌ సక్సెస్‌

 
  • అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహణ
  • మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తిల హౌస్‌ అరెస్ట్‌
  • నిరసనను అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు 
  • హర్తాళ్‌కు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీల మద్దతు
  • పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ నేతల అరెస్టులు
  • గుంటూరులో బస్సులను అడ్డుకున్న ఎమ్మెల్యే ముస్తఫా, అప్పిరెడ్డి
  • విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ
 
 
సాక్షి, గుంటూరు :  పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు పడుతున్న ఇబ్బందులు పరిష్కరించకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ, అఖిల పక్షాల ఆధ్వర్యంలో సోమవారం జిల్లాలో జరిగిన హర్తాళ్‌ కార్యక్రమం విజయవంతమైంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోలీసులు తెల్లవారుజాము నుంచే భారీగా రోడ్లపైకి చేరి హర్తాళ్‌ కార్యక్రమాన్ని అడుగడుగునా అడ్డుకున్నారు. అయితే గుంటూరు నగరంతోపాటు అనేక నియోజకవర్గాల్లో వ్యాపారులు దుకాణాలు మూసివేసి హర్తాళ్‌కు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌తో పాటు, గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తిలను పోలీసులు తెల్లవారుజామునే హౌస్‌ అరెస్టులు చేశారు. 
 
భారీగా అరెస్టులు...
గుంటూరు నగరంలో ఎమ్మెల్యే షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా, నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, లాల్‌పురం రాము, కిలారి రోశయ్యల ఆధ్వర్యంలో భారీగా పార్టీ శ్రేణులు ఆర్టీసీ బస్టాండ్‌  ఎదుట బైఠాయించి కొంత సేపు అడ్డుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పాదయాత్రగా బయలుదేరి పాతబస్టాండ్, మార్కెట్, హిందూ కళాశాల మీదుగా లాడ్జిసెంటర్‌ నుంచి మదర్‌థెరిస్సా విగ్రహం వరకు సాగారు. ముందుగా జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. శాంతియుతంగా ర్యాలీలు చేస్తున్న తమపై పోలీసులు దౌర్జన్యానికి దిగడంపై గుంటూరు ఈస్ట్‌ ఎమ్మెల్యే ముస్తఫా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు, వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలుపుతూ హర్తాళ్‌లో పాల్గొన్నారు. గుంటూరు నగరంలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు హర్తాళ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు వైఎస్సార్‌సీపీకి చెందిన 35 మందిని, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 20 మందిని, సీపీఐకి చెందిన 15 మందిని అరెస్టు చేశారు. 
 
రాస్తారోకోలు, మానవహారాలు...
మాచర్ల పట్టణంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరామిరెడ్డిల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. నరసరావుపేట పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్‌గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో హర్తాళ్‌ నిర్వహించారు. మల్లమసెంటర్‌లో మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. సీపీఐ, సీపీఎం, ప్రజాసంఘాలు కూడా హర్తాళ్‌ నిర్వహించాయి. సత్తెనపల్లి పట్టణంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో ప్రదర్శన నిర్వహించి గడియారస్తంభం సెంటర్‌లో మానవహారం ఏర్పాటుచేశారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు హర్తాళ్‌లో పాల్గొన్నారు. పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలో ప్రదర్శన జరిపి హర్తాళ్‌ నిర్వహించారు. వినుకొండలో పార్టీ సమన్వకర్త బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై పట్టణంలో ప్రదర్శన చేపట్టారు. శివయ్య స్థూపం వద్ద కొంతసేపు నిరసన తెలిపారు. సీపీఐ, సీపీఎం నాయకులు మద్దతు పలికారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించి హర్తాళ్‌ చేశారు. తెనాలి పట్టణంలో సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్‌ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా మార్కెట్‌ యార్డు నుంచి ప్రదర్శనగా ఆర్డీవో కార్యాలయం వరకు వెళ్లి ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. పట్టణంలో షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీ నేతలు వేర్వేరుగా హర్తాళ్‌ నిర్వహించారు. తాడికొండ అడ్డరోడ్డు వద్ద వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కత్తెర హెనిక్రిస్టినా ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చి రాస్తారోకో నిర్వహించారు. సీపీఐ, సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. మంగళగిరిలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు యేళ్ళ జయలక్ష్మి, ఎంపీపీ పచ్చల రత్నకుమారి ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించి హర్తాళ్‌ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ, సీపీఎం నేతలు మద్దతు తెలిపారు. పోలీసులు 23 మందిని అరెస్టు చేశారు. చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్‌ను హౌస్‌ అరెస్టు చేసినప్పటికీ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని బైక్‌ ర్యాలీ నిర్వహించి, హర్తాళ్‌ను విజయవంతం చేశారు. సీపీఐ, సీపీఎం నేతలు విడిగా హర్తాళ్‌ నిర్వహించారు. గురజాల నియోజకవర్గంలో జంగా కృష్ణమూర్తిని హౌస్‌ అరెస్టు చేసినప్పటికీ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని హర్తాళ్‌ జరిపారు. బాపట్ల పట్టణంలో పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో హర్తాళ్‌ నిర్వహించారు. సీపీఐ, సీపీఎం నాయకులు హర్తాళ్‌కు మద్దతు పలికారు. ప్రత్తిపాడులో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై హర్తాళ్‌ నిర్వహించారు. షాపులు మూయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు హర్తాళ్‌కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు 11 మందిని అరెస్టు చేశారు. రేపల్లె, వేమూరు, పెదకూరపాడు నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని హర్తాళ్‌ నిర్వహించారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement