ఎమ్మెల్యేకు రూ.8 కోట్ల ఆఫర్
ఎమ్మెల్యేకు రూ.8 కోట్ల ఆఫర్
Published Thu, Mar 3 2016 1:32 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేకు ఏకంగా రూ. 8 కోట్ల ఆఫర్
మధ్యవర్తులుగా అధికార పార్టీ నేతలు
టీడీపీ రాజకీయాలను ఈసడించుకుంటున్న ప్రజలు
సాక్షి, కర్నూలు: ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టిదన్నుగా ఉన్న కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యేల కొనుగోలుకు అధికార పార్టీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. తాజాగా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీని కూడా కండువా కప్పి తమ పార్టీలోకి ఆహ్వానించారు. భారీగా ప్యాకేజీని ఆఫర్ చేసి మరీ టీడీపీలోకి చేర్చుకోవడం జిల్లాలో చర్చనీయాంశమైంది. వాస్తవానికి కోడుమూరు ఎస్సీ రిజర్వు నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ఒకప్పుడు కోట్ల కుటుంబానికి కంచుకోటగా ఉండేది. అలాంటి చోట గత సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున బరిలో నిలిచిన మణిగాంధీకి ప్రజలు జిల్లాలోనే అత్యధిక మెజారిటీని కట్టబెట్టారు. ఇది రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద మెజారిటీ కావడం విశేషం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం.. అధినేత వైఎస్ జగన్‌పై ఉన్న అభిమానంతో గెలిచిన కోడుమూర ఎమ్మెల్యే టీడీపీ తీర్థం పుచ్చుకున్నాక.. కేవలం నన్ను చూసే జనం ఓట్లేశారని చెప్పుకోవడంపై కోడుమూరు నియోజకవర్గ ప్రజలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతోపాటు అభిమానులు మండిపడుతున్నారు.
మధ్యవర్తులుగా టీడీపీ నేతలు
ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను లాగేందుకు అధికార పార్టీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో కొద్దిమంది ఏకంగా ఒక అడుగు ముందుకు వేసి మధ్యవర్తులు (దళారులు)గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలానా ఎమ్మెల్యేకు రూ. 9 కోట్లు ఇస్తే వస్తారంటూ... ఎమ్మెల్యేకు రూ 5-6 కోట్లు చెబుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పార్టీ మారిన ఎమ్మెల్యే విషయంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేకు కోట్లు ఇచ్చేందుకు ఒప్పించిన ఓ నేత డీల్ కుదిర్చినందుకు తాను రూ. 3 కోట్లు దక్కించుకోవాలని ఎత్తుగడ వేశాడు. అయితే, ఈ కథ తెలిసి సదరు ఎమ్మెల్యే కాస్తా.. నేను పార్టీ మారను అంటూ మొండికేయడంతో కథ అడ్డం తిరిగినట్లు సమాచారం. దీంతో సదరు నేతను ఆయన సోదరుడు, మాజీ మంత్రి మందలించినట్లు తెలిసింది. ఇలాంటి చోటా కక్కుర్తి పడటం సరికాదని హెచ్చరించి.. సదరు ఎమ్మెల్యేతో మాట్లాడి రూ. 6 కోట్లకు ఒప్పందం కుదుర్చినట్లు సమాచారం. ఈ ముడుపుల వ్యవహారం అంతా గుంటూరుకు చెందిన నేతలు నడిపినట్లు తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డ నేతలు.. నిన్నమొన్నటి వరకు పార్టీ మారేది లేదు.. ప్రాణం పోయే వరకు పార్టీలోనే ఉంటామని.. ఇప్పుడు కేవలం డీల్ కోసమే పార్టీ మారడం పట్ల నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లా ప్రజలందరూ ఈసడించుకునే పరిస్థితి ఏర్పడింది.
అండగా ఉన్న వ్యక్తిని మోసగించి..
కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీని తన కుటుంబ సభ్యునిగా భావించి సహాయం అందించిన వ్యక్తిని, పార్టీని కాదని వెళ్లిపోవడం పట్ల నియోజకవర్గంతోపాటు జిల్లా వ్యాప్తంగా విమర్శల పరంపర కొనసాగుతోంది. కోడుమూరు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీతిమాలిన రాజకీయాలు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే మణిగాంధీ కుటుంబానికి వైఎస్ జగన్ ఎంతో సహాయం చేశారని, అలాంటి వ్యక్తిని మోసగించడం సబబు కాదని విమర్శిస్తున్నారు. రాజకీయంగా ఇక మణిగాంధీకి పుట్టగతులుండవని ప్రజలు మండిపడుతున్నారు.
Advertisement