రైల్వే జోన్ వస్తే రాష్ట్రానికి మేలు: బొత్స
రాజకీయ నిర్ణయం తీసుకోవాలి..
విభజన చట్టం హామీని అమలు చేయాలి
రౌండ్‌టేబుల్ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేత బొత్స
విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వే జోన్ రాష్ట్రానికి... రాష్ట్ర ప్రజలకు... రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన సమస్య అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖకు రైల్వే జోన్ వస్తే ఉత్తరాంధ్రకే కాదు.. రాష్ట్రం మొత్తానికి మేలు జరుగుతుంది ఆయన అన్నారు.
బుధవారం విశాఖ ఆంకోసా హాలులో రైల్వే జోన్ సాధనకు 'రైల్వే జోన్ మన హక్కు-స్ఫూర్తి విశాఖ ఉక్కు' అనే నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. మోదీ మంత్రి వర్గంలోని వెంకయ్యనాయుడు విశాఖ రైల్వే జోన్ కోసం కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. రైల్వే జోన్ ఇవ్వడానికి కేంద్రానికి ఉన్న ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై విభజన చట్టం లేదన్నారు.. మరి రైల్వే జోన్ చేర్చారు కదా? ఎందుకు అమలు చేయడం లేదు? పైగా రాష్ట్ర శాసనసభలోనూ విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ మద్దతుతో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. జోన్‌పై కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడం తగదు. తక్షణమే రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే ఆ పేరు మీకే వస్తుంది. ఆ లబ్ది మీరే పొందండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బొత్స సూచించారు.
గతంలో ఏర్పాటు చేసిన రైల్వే జోన్లు రాజకీయ కోణంలో చేసిన వేనవేనని ఆయన గుర్తు చేశారు. విశాఖ జోన్‌పై కూడా ఎలాంటి సాకులూ చెప్పకుండా రాజకీయ నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఇందుకు అన్ని పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కె.హరిబాబు, టీడీపీ మంత్రులు, ఎంపీల మాట చెల్లుబాటవుతుందని, ఒత్తిడి చేసి జోన్ తీసుకురావాలన్నారు. సీఎం చంద్రబాబు జోన్‌పై ఇదిగో, అదిగో అంటూ మోసం చేస్తున్నారని విమర్శించారు.
రైళ్లను అడ్డుకోవడం, ఉద్యమాలు, ఆందోళనలతో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకముందే జోన్ ప్రకటించాలని సూచించారు. జోన్ కోసం కార్యాచరణ రూపొందించాలని కోరారు. జోన్ సాధన కోరుతూ ఈ నెల 14 నుంచి వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి రైల్వే జోన్ సాధనకు గిరిజనులు అండగా ఉంటారన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు రైల్వే జోన్ ఇచ్చి తీరాలన్నారు. టీడీపీ, బీజేపీలు అధికారంలోకి వచ్చి మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా జోన్ ఇవ్వలేదన్నారు. దీనిపై ఉత్తరాంధ్ర ప్రజలు, అన్ని పార్టీల నేతలు, మేధావులు, ప్రజాసంఘాలు, ఉద్యోగ, విద్యార్థి, మహిళా సంఘాల మద్దతు కలిపి 14న విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రైల్వే జోన్ సాధనకు నిరవధిక నిరాహారదీక్షకు దిగుతున్నట్టు ప్రకటించారు.
ప్రజాస్పందన అధ్యక్షుడు, రిటైర్డు ఐఈఎస్ అధికారి సీఎస్ రావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన ఆరు నెలల్లోపు విశాఖకు ఇస్తామన్న రైల్వే జోన్ ఇవ్వలేదన్నారు. స్థానిక ఎంపీ హరిబాబు జోన్ వస్తుందంటూ రెండేళ్లుగా మోసం చేసినందుకు ఎంపీ హరిబాబుపై అవిశ్వాసం పెట్టడానికి ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. హరిబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోనందుకు ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రౌండ్‌టేబుల్ సమావేశంలో ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, తైనాల విజయకుమార్, కర్రి సీతారామ్, మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాథం, సీపీఐ కార్యదర్శి పైడిరాజు, లోక్‌సత్తా నేత భీశెట్టి బాబ్జీ, రైల్వే శ్రామిక యూనియన్ జోనల్ కార్యదర్శి చలసాని గాంధీ, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు వంశీకృష్ణయాదవ్, కోలా గురువులు, రొంగలి జగన్నాథం, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కంపా హనోకు, జాన్‌వెస్లీ, పార్టీ జిల్లా పార్టీ మహిళా అధ్యక్షురాలు ఉషాకిరణ్, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు ఎస్.ఎస్.శివశంకర్, ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ కన్వీనర్ జేటీ రామారావు, ఏయూ ప్రొఫెసర్లు బాబీవర్థన్, జాన్, న్యాయవాదులు, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు.