'చంద్రబాబు సర్కార్ అరాచకాలకు పాల్పడుతోంది'
తిరుపతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం తిరుపతిలో నిప్పులు చెరిగారు. ఎంపీ మిథున్రెడ్డిని అరెస్ట్ చేయడం దుర్మార్గం అని అన్నారు. చంద్రబాబు సర్కార్ అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ అంశాన్ని న్యాయస్థానంలో తేల్చుకుంటామన్నారు. ఎలాంటి బెదిరింపులకు తాము భయపడమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ 420 అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి, ఆర్కే రోజా, నారాయణస్వామి ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలని చంద్రబాబు కుట్రపన్నుతున్నారని విమర్శించారు. మిథున్రెడ్డి ప్రజాదరణ ఉన్న నాయకుడు అని వారు అభివర్ణించారు. ఓర్వలేక మిథున్రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారన్నారు. అయితే కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్వార్వో డి. వనజాక్షిపై దాడి చేసిన దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ఈ సందర్భంగా చంద్రబాబు సర్కార్ను వారు ప్రశ్నించారు. మిథున్రెడ్డిపై అన్యాయంగా కేసు నమోదు చేశారని పెద్దిరెడ్డి, ఆర్కే రోజా, నారాయణస్వామి తెలిపారు.