బంద్ విజయవంతం
-
2 వేల మంది ఆందోళనకారుల అరెస్టు
-
32 కేసుల నమోదు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు:
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో టీడీపీ, బీజేపీ తీరుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నెల్లూరు జిల్లాలో బంద్ విజయవంతంగా జరిగింది. సీపీఐ, సీపీఎంతో పాటు వివిధ కార్మిక సంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించి పాల్గొన్నాయి. బంద్‌కు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించడంతో ప్రభుత్వం పోలీసుల ద్వారా బంద్ విఫలం చేసేందుకు ప్రయత్నించింది. ప్రశాంతంగా బంద్ నిర్వహిస్తున్న సుమారు రెండు వేల మందిని అరెస్టు చేశారు. జిల్లాలో వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలను ఆందోళనకారులు మూసి వేయించారు. జిల్లాలోని 10 ఆర్టీసీ డిపోల పరిధిలో సుమారు 400 బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు. ఆందోళనకారుల మీద పోలీసులు 31 కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్, సీపీఎం నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, సీపీఐ నాయకులు దశరథరామయ్య ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. సీపీఐ నాయకులు పముజుల దశరథరామయ్య, సీపీఎం నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కత్తి శ్రీనివాసులుతో పాటు పలువురు నాయకులను అరెస్టు చేశారు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్, సీపీఐ జిల్లా కార్యదర్శి పార్థసారథి బంద్‌లో పాల్గొన్నారు. వెంకటాచలంలో జాతీయ రహదారిమీద బంద్‌కు ఉపక్రమిచడంతో ఉదయం 11 గంటల సమయంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నగరంలో భారీ బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఆత్మకూరు బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్, కేవీఆర్ ప్రెటోల్ బంకు వద్ద సీపీఎం, సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు. ఉదయగిరిలో ఉదయగిరి ఉదయం 6 గంటల నుంచి బంద్ ప్రారంభించారు. ఉదయం పదిన్నర గంటల సమయంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఎం నాయకులు కాకు వెంకటయ్యతో పాటు 200 మందిని పోలీసులు అరెస్ట్‌చేసి స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ కారణంగా కిలో మీటర్ల దూరం వాహనాలు నిలచిపోయాయి. దీంతో పోలీసులు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో సూళ్లూరుపేట – శ్రీహరికోట రోడ్‌లో దావాదిగుంట వద్ద రోడ్డుపై బైఠాయించారు. నియోజకవర్గంలో కోవూరులో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కోవూరులో జాతీయ రహదారి మీద ధర్నా చేసి బంద్ నిర్వహించారు. కోవూరు మండలం ఇనమడుగు వద్ద బంద్ నిర్వహిస్తున్న సీపీఎం నాయకులను అరెస్ట్ చేశారు. గూడూరు పట్టణంలో వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త మేరిగ మురళీధర్, పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డిలు పార్టీ నాయకులూ కార్యకర్తలతో కలసి ఉదయం 5 గంటలకే ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకుని బస్సులు బయటకు తీయనీయకుండా చేశారు. టవర్‌క్లాక్ కూడలి వద్ద మేరిగ, ఎల్లసిరిలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి 1వ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఉదయం 5 గంటలకే ఎమ్మెల్యే పార్టీ నాయకులతో కలసి ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకుని బస్సులు బయటకు పోకుండా అడ్డుకున్నారు. పట్టణంలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను మూసివేయిస్తుండగా పోలీసులు ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో వెంకటగిరిలో నిర్వహించిన బంద్ విజయవంతం అయింది. తెల్లవారు జామున 4 గంటలనుంచే వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆర్టీసీ డిపోవద్ద బైఠాయించి బస్సులను నిలపుదల చేయించారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులతోపాటు జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని పోలీసులు అరెస్టు చే శారు.