విద్యార్థులపై పోలీస్ జులుం
విద్యార్థులపై పోలీస్ జులుం
Published Mon, Apr 17 2017 11:13 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM
డీఈవో కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ధర్నా
ఈడ్చుకెళ్లిన పోలీసులు
కాకినాడ : కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్రయోజనం కలిగేలా రేషనలైజేషన్ పేరిట ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డీఈవో కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు జులుం ప్రదర్శించి పోలీసుస్టేషన్‌కు ఈడ్చుకెళ్లడంతో గందరగోళం నెలకొంది. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా కాకినాడ మెయిన్‌రోడ్డులోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు సోమవారం ధర్నా చేశారు. పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన షేక్ సలాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా విద్యార్థుల సంఖ్య తక్కువ ఉందన్న కారణంతో ప్రస్తుతం ఉన్న మూడు అంచెల పాఠశాలల విధానానికి చరమగీతం పాడడం సరికాదన్నారు. ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్టును ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. పాఠశాలలను కుదిస్తే డ్రాప్ అవుట్స్ పెరిగి కార్పొరేట్ పాఠశాలలకు ప్రయోజనం కలిగేలా ఉందన్నారు. ఫలితంగా ఫీజుల భారం మోయలేక పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి కిరణ్ మాట్లాడుతూ పురాతన భవనాలకు మరమ్మతులు చేపట్టి కనీస మౌలిక సదుపాయలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ నియామకాలు భర్తీచేసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కార్పొరేట్ స్కూల్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంతోపాటు తెలుగుమీడియం కూడా కొనసాగించాలన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి చింతపల్లి మధుసూదనరెడ్డి, మొగలమూరి అజయ్, ముద్రగడ నాయుడు కార్తీక్, కాకినాడ నగర విద్యార్థి విభాగం అధ్యక్షుడు రోకళ్ల సత్యనారాయణ, విద్యార్థి విభాగం నాయకులు పసుపులేటి మణీష్, చిట్నీడి మణికుమార్, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం
ధర్నా అనంతరం వినతిపత్రం ఇచ్చేందుకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోకి వెళ్తున్న విద్యార్థులపై పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. లోపలికి వెళ్లేందుకు వీలులేదంటూ రెండో అంతస్తులో ఉన్న విద్యార్థులను మెట్లపై నుంచి బలవంతంగా తోసివేశారు. దీనిని అడ్డుకున్న రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలాంబాబు, జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి కిరణ్ సహా పలువురు విద్యార్థి నేతలపై కూడా పోలీసులు అదే రీతిలో వ్యవహరించి బలవంతంగా పోలీసుస్టేషన్‌కు తరలించారు. చొక్కా పట్టుకుని ఈడ్చుకువెళ్లిన తీరుతో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ కాకినాడ నగరాధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. సంఘటన వివరాలను జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కన్నబాబు పోలీసులతో మాట్లాడారు. అనంతరం అదుపులోకి తీసుకున్న విద్యార్థి నేతలను విడిచిపెట్టారు.
Advertisement