'కాలచక్రం తిరిగొస్తుంది.. పాతాళంలోకి వెళతారు'
గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిలాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన కుటుంబం దొంగపనులు చేయలేదని అంబటి రాంబాబు అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను దొంగ దీక్ష అని చంద్రబాబు మంత్రులు మాట్లాడటం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేస్తున్న దీక్ష ఆరో రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ దొంగలెక్కలు, మోసపూరిత హామీలు మీవే అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు.
చిత్తశుద్దితో దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ పై ఆరోపణలు మానుకోవాలని లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇష్టమొచ్చినట్లు వాఖ్యానిస్తున్నారని, అసలు రక్త నమునాలు ఎప్పుడు తీసుకుంటున్నారో పరీక్షలు ఎప్పుడు చేస్తున్నారో మీకు తెలుసా అని ప్రశ్నించారు. గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరికరాలు లేక ప్రైవేటు పరీక్ష కేంద్రాల్లో టెస్టులు చేస్తున్నారంటే ప్రభుత్వం ఎంత పనికిరాని పరిపాలన చేస్తుందో అర్థం కావడం లేదా అని నిలదీశారు. ఆరు రోజులుగా నిద్రాహారాలు మానుకొని వైఎస్ జగన్ దీక్ష చేస్తుంటే కనిపించడం లేదా అన్నారు. మెచ్చుకోకపోయినా పర్వాలేదుకానీ ఆరోపణలు మాత్రం చేయొద్దని అన్నారు.
మంత్రులు, చంద్రబాబునాయుడు అధికార తిమ్మిరితో అహంబావంతో వ్యవహరిస్తున్నారని, కాలం తిరిగొచ్చి వారిని అధపాతాళంలోకి నెట్టి వేసే రోజు తొందర్లోనే వస్తుందని మండిపడ్డారు. ప్యాకేజీలు గురించి అసలు ఎందుకు మాట్లాడుతున్నారని, దాని గురించి మాట్లాడకపోయినా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, ప్రత్యేక హోదాపై మాత్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కుట్ర చేసి రాష్ట్రాన్ని విడదీసి ప్రత్యేక హోదా ఇస్తామని నాడు కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని, అందుకు టీడీపీ కూడా మద్దతు పలికిందని ఇప్పుడు మాత్రం ప్రత్యేక హోదా ఎందుకని ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.