రాజధాని నిర్మాణం సినిమా సెట్టింగ్ కాదు
హైదరాబాద్: దీనావస్థలో ఉన్న రైతులను చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడంలేదని, కేవలం ప్రచారానికే పరిమితమైపోయిందని వైఎస్సార్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కె. కన్నబాబు విమర్శించారు. ప్రజాసమస్యలను గాలికొదిలేసిన సీఎం చంద్రబాబు విదేశీపర్యటనలు, ప్రచారయావకే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
"బ్యాంకుల్లో కొత్త రుణాలు ఇవ్వడంలేదు. దీంతో అప్పుపుట్టక రైతాంగం సంక్షోభంలో మునిగిపోయింది. ధరల స్థిరీకరణ నిధి అంటూ ఆర్భాటాలు చేసిన ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకపోవడం దారుణం. సీఎం చంద్రబాబుకు సొంత సంస్థ హెరిటేజ్‌పై ఉన్న ప్రేమ రైతులపై లేదు. బ్యాంకులతో హెరిటేజ్ ఒప్పందాలు చేసుకున్నట్లు రైతులతో ప్రభుత్వం ఎందుకు ఒప్పందాలు చేసుకోవడంలేదు? కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల సమస్యలపై దృష్టిసారించాలి"అని కన్నబాబు అన్నారు. అమరావతి నిర్మాణానికి సలహాలంటూ రోజుకో దర్శకుడితో మాట్లాడుతున్న చంద్రబాబు తీరు హాస్యాస్పదంగా ఉందన్న కన్నబాబు.. రాజధాని నిర్మాణం సినిమా సెట్టింగ్ కాదని గుర్తుచేశారు.