రైతులను మభ్యపెట్టేందుకే ఏరువాక
► ఒట్టి దుబారా కార్యక్రమం
► జిల్లాకు 29 సార్లు వచ్చిన సీఎం ఏంచేశారు
► చంద్రబాబు మోసాలను గడపగడపకూ వివరిస్తాం
► మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు
నరసాపురం: రైతుల కోసం ఏమీ చేయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిని మభ్యపెట్టేందుకే ఏరువాక కార్యక్రమం చేపట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ముదునూరి ప్రసాదరాజు ధ్వజమెత్తారు. ఆదివారం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతులు సంతోషంగా ఉంటే పండగ చేసుకుంటారని, చంద్రబాబు రెండేళ్ల పాలనలో వారికి ఏం మేలు జరిగిందని ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్ట్ ముందుకు కదలడం లేదని, కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడంకోసం పనుల వ్యయాన్ని మాత్రం ప్రభుత్వం రెట్టింపు చేస్తోందని విమర్శించారు. జిల్లాలో శివారు ప్రాతాలకు ఎక్కడా సాగునీరు అందే పరిస్థితి లేదని, కాలువలను ఈనెల 10న విడుదల చేసినా, ఇంకా 80శాతం ప్రాంతాల్లో చిన్న కాలువలకు నీరు చేరలేదని, నీటిని కూడా అందించలేని ప్రభుత్వం సిగ్గుపడటం మాని, ఏరువాక అంటూ రూ.కోట్లు దండగ చేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇది ఒట్టి దుబారా కార్యక్రమమని అభివర్ణించారు.
రెండేళ్లలో ఒరిగిందేమిటీ?
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రైతులకు ఒరిగిందేమీ లేదని, ఈ కాలంలో మూడు తుపాన్లు వచ్చాయని, రైతులు దారుణంగా నష్టపోయారని, అయినా వారికి పరిహారంగానీ, సాయం గానీ అందించలేదని విమర్శించారు. రుణమాఫీ విషయంలో అన్నదాతలను బాబు దగా చేశారని మండిపడ్డారు. డెల్టా ఆధునికీకరణ పనులు సాగక, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఏరువాక పండగ అంటూ ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించారు.
అసలు వ్యవసాయం దండగ అన్న బాబు, ఇప్పుడు రైతులకు రిక్తహస్తం చూపి పండగ అనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 30వ సారి జిల్లాకు వస్తున్న సీఎం, అసలు ఈ జిల్లాకు ఈ రెండేళ్లలో ఏం మేలు చేశారో చెప్పాలని ముదునూరి డిమాండ్ చేశారు. చంద్రబాబు మోసాలను రాష్ట్రంలోని ప్రతి గడపగడపకూ తిరిగి వివరిస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబును ప్రజలు బహిరంగంగా నిలదీసే రోజును వైఎస్సార్ సీపీ తీసుకొస్తుందని స్పష్టం చేశారు.