నీలాపుట్టుగ: ప్రజా సమస్యలపై వైఎస్‌ఆర్ సీపీ రాజీ లేని పోరాటం చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి అన్నారు. ఆమె శుక్రవారం కేశుపురం పంచాయతీ నీలాపుట్టుగలో గ్రామస్తులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మాయలో పడిన ప్రజలు ఓట్లేసి గెలిపించారని, ఇప్పుడాయన తీరు చూసి తిట్టుకుంటున్నారని అన్నారు.
డ్వాక్రా మహిళలకు పూర్తిగా రుణ మాఫీ చేస్తామని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామనీ, రైతులకు రుణమాఫీ చేస్తానంటూ నమ్మబలికిన చంద్రబాబు గెలిచిన తర్వాత విదేశీయుల మాయలో పడి రాష్ట్రాన్ని నడి రోడ్డున వదిలేశారని రెడ్డి శాంతి ఆరోపించారు. జిల్లా ప్రజలు కరువుతో అల్లాడుతుంటే నాయకులు మాత్రం ఆదుకోవడం పక్కన బెట్టి మహానాడు, నవనిర్మాణ దీక్ష అంటూ వేలాది రూపాయలు ఖర్చు పెట్టడం సబబు కాదన్నారు. పరిపాలన చూడాల్సిన అధికారులను నవ నిర్మాణ దీక్షలో భాగంగా సెమినార్లను నిర్వహించండంటూ ఆదేశాలు జారీ చేయడం అనాగరిక చర్యని అన్నారు. సమావేశంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు, సర్పంచ్ నీలాపు చంద్రయ్య, ఉప సర్పంచ్ నీలాపు మోహనరావు, జిల్లా పార్టి కార్యదర్శి పీఎం తిలక్, కవిటి మండల కన్వీనర్ కడియాల ప్రకాష్, మండల ఎస్సీ సెల్ కన్వీనర్ బాగ మోహనరావు, గ్రామ పెద్దలు నీలాపు కృష్ణారెడ్డి, దక్కత సింహాద్రి రెడ్డి, కర్రి పొట్టెయ్య, పి.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
'బాబు తీరుతో ప్రజలు తిట్టుకుంటున్నారు'
Published Sat, Jun 4 2016 11:13 AM | Last Updated on Sat, Aug 18 2018 6:11 PM
Advertisement
Advertisement