
బాబుని అపర భగీరథుడనడం సిగ్గుచేటు
– సీఎం కుటుంబం బాగుంటే అందరూ బాగున్నట్టేనా?
– నెలాఖరులోగా ఇన్‌పుట్ సబ్సీడీ ఇవ్వాలి
– మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
అనంతపురం : హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలను జిల్లాకు తీసుకొచ్చిన అపరభగీరథుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని టీడీపీ నేతలు చెప్పడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ముందుగా గురునాథరెడ్డి మాట్లాడుతూ కృష్ణా జలాలు జిల్లాకు ఎవరు తీసుకొచ్చారో టీడీపీ నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. బాబు సీఎం అయిన తర్వాత జిల్లాలో 17–18 సార్లు పర్యటించారన్నారు. వచ్చిన ప్రతిసారీ దాదాపు 10–15 హామీలు ఇస్తున్నారు వాటిలో ఒక్కటైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు.
తొమ్మిదేళ్ల చంద్రబాబు హయాంలో కనీసం ఒక కిలోమీటరు కూడా హంద్రీ–నీవా తవ్వించలేదని ఎద్దేవా చేశారు. ఆయన జిల్లాకు వచ్చిన ప్రతిసారి రూ.15–20 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఈ డబ్బును రైతాంగానికి ఖర్చు చేసి ఉంటే సాగునీరైనా అందేదన్నారు. జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వారి పబ్బం గడుపుకోవడానికి, వారి నియోజకవర్గాల్లో అంతో ఇంతో చెరువులకు నీళ్లిచ్చి ఏదో సాధించామని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. సీఎం కుటుంబం బాగుంటే అందరూ బాగున్నట్లు భావిస్తున్నారన్నారు. నెలాఖరులోగా ఇన్‌పుట్ సబ్సీడీ ఇవ్వాలని కోరారు. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ రైతులను మోసపుచ్చే మాటలనే సీఎం మరోసారి మాట్లాడారని చెప్పారు.
ఇన్సూరెన్స్ ఆధారంగా ఇన్‌పుట్ సబ్సీడీ ఎరకాకు రూ. 6 వేలకు మించి ఇస్తామని ప్రకటించారన్నారు. ఏప్రిల్–మేలో ప్రకటించే ఇన్సూరెన్స్ కోసం ఎదురు చూడాలా? అని ప్రశ్నించారు. ఇన్‌ఫుడ్ సబ్సీడీ ఎకరాకు రూ. 6 వేలు ఇస్తే ఏమాత్రం సరిపోదన్నారు. ఎకరాకు కనీసం రూ. 15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గొల్లపల్లి రిజర్వాయర్‌కు హంద్రీ–నీవా నీటిని నామమాత్రంగా ఇస్తున్నారన్నారు. దీనికింద ఉన్న 10 వేల ఆయకట్టు రద్దు చేశారన్నారు. చివరిదాకా నీళ్లు తీసుకెళ్లి తర్వాత ఆలోచిస్తామని ముఖ్యమంత్రి చెప్పారంటే మన జిల్లాలో ఒక ఎకరా ఆయకట్టుకు నీళ్లివరనేది స్పష్టమవుతోందని విమర్శించారు.
మాజీ మేయర్ రాగే పరుశురాం మాట్లాడుతూ విదేశాలకు వెళ్లినప్పుడు కలలో కూడా అనంత జిల్లా గుర్తుకు వస్తుందని చెప్పే ముఖ్యమంత్రి అభివృద్ధి హామీలు తప్ప ఒక్కటైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు. అనంత జిల్లాను వైఎస్ ప్రత్యేక దృష్టితో చూసి హంద్రీ–నీవా ఇచ్చారన్నారు. జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరిచ్చిన తర్వాతనే బయటకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.