gurunathareddy
-
హామీలతో అన్నివర్గాలను వంచించిన బాబు
–మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి అనంతపురం సప్తగిరి సర్కిల్: ఎన్నికల్లో బూటకపు హామీలతో చంద్రబాబు అధికార పీఠం ఎక్కి ఆ తర్వాత అన్ని వర్గాలవారిని వంచించారని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి తెలిపారు. స్థానిక ఆర్డీఓ కార్యలయం ఎదుట ధర్నా చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల దీక్షా శిబిరాన్ని గురునాథరెడ్డి సందర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో బీజేపీ, సినిమా హీరో పవన్‌కళ్యాణ్‌తో కలిసి హామీలను గుప్పించారన్నారు. హామీలను నెరవేర్చకపోవడంతో వంచనకు గురైనవర్గాలవారు కఽలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల మంది కాంట్రాక్ట్ అధ్యాపకులున్నారని, వారికి సమాన పనికి సమాన వేతనాన్ని అందించడం పెద్ద కష్టమైన పని కాదన్నారు. మంగళవారం విద్యార్థి సంఘాలు, యువజన నాయకులు, కాంట్రాక్ట్ అధ్యాపకులతో కలిసి కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, మైనార్టీ నాయకులు ముక్తియార్, కాంట్రాక్ట్ అధ్యాపకులు హనుమంతరెడ్డి, శివారెడ్డి, ఎర్రప్ప, రామలింగా, రామాంజినేయులు, రాధమ్మ, రాధిక, భాస్కర్‌రెడ్డి, అరుణ, శంకరప్ప, రామన్న, సత్యనారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మూడింది
కదిరి: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కదిరి పట్టణంలోని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్దారెడ్డి స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. అబద్దపు హామీలతో గద్దె నెక్కిన చంద్రబాబు ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదన్నారు. రైతు, డ్వాక్రా, చేనేత రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి..అందరినీ నిలువునా ముంచారన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు హస్తం ఉందన్న విషయం అందరికీ తెలుసని, ప్రజా కోర్టులో ఆయన ముద్దాయేనని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా తీసుకొస్తామని బీజేపీ, టీడీపీ ఎన్నికలకు మునుపు చెప్పి, ఇప్పుడు హోదా అవసరమే లేదని, ప్యాకేజీ చాలని చెప్పడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. ప్రత్యేకహోదా సాధనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు. పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించడం కోసం మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే.. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని అనారోగ్యశ్రీగా మార్చేశారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ముస్లింల తలాక్ విషయంలో జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. పెద్ద నోట్ల రద్దును తాము తప్పుబట్టడం లేదని, అయితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా రద్దుచేయడం అనాలోచిత నిర్ణయమేనని అన్నారు. సమావేశంలో కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సిద్దారెడ్డి, సీఈసీ సభ్యుడు జక్కల ఆదిశేషు, రాష్ట్ర కార్యదర్శి వజ్రభాస్కర్‌రెడ్డి, పాల్గొన్నారు. -
బాబుని అపర భగీరథుడనడం సిగ్గుచేటు
– సీఎం కుటుంబం బాగుంటే అందరూ బాగున్నట్టేనా? – నెలాఖరులోగా ఇన్పుట్ సబ్సీడీ ఇవ్వాలి – మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అనంతపురం : హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలను జిల్లాకు తీసుకొచ్చిన అపరభగీరథుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని టీడీపీ నేతలు చెప్పడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ముందుగా గురునాథరెడ్డి మాట్లాడుతూ కృష్ణా జలాలు జిల్లాకు ఎవరు తీసుకొచ్చారో టీడీపీ నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. బాబు సీఎం అయిన తర్వాత జిల్లాలో 17–18 సార్లు పర్యటించారన్నారు. వచ్చిన ప్రతిసారీ దాదాపు 10–15 హామీలు ఇస్తున్నారు వాటిలో ఒక్కటైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు హయాంలో కనీసం ఒక కిలోమీటరు కూడా హంద్రీ–నీవా తవ్వించలేదని ఎద్దేవా చేశారు. ఆయన జిల్లాకు వచ్చిన ప్రతిసారి రూ.15–20 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఈ డబ్బును రైతాంగానికి ఖర్చు చేసి ఉంటే సాగునీరైనా అందేదన్నారు. జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వారి పబ్బం గడుపుకోవడానికి, వారి నియోజకవర్గాల్లో అంతో ఇంతో చెరువులకు నీళ్లిచ్చి ఏదో సాధించామని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. సీఎం కుటుంబం బాగుంటే అందరూ బాగున్నట్లు భావిస్తున్నారన్నారు. నెలాఖరులోగా ఇన్పుట్ సబ్సీడీ ఇవ్వాలని కోరారు. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ రైతులను మోసపుచ్చే మాటలనే సీఎం మరోసారి మాట్లాడారని చెప్పారు. ఇన్సూరెన్స్ ఆధారంగా ఇన్పుట్ సబ్సీడీ ఎరకాకు రూ. 6 వేలకు మించి ఇస్తామని ప్రకటించారన్నారు. ఏప్రిల్–మేలో ప్రకటించే ఇన్సూరెన్స్ కోసం ఎదురు చూడాలా? అని ప్రశ్నించారు. ఇన్ఫుడ్ సబ్సీడీ ఎకరాకు రూ. 6 వేలు ఇస్తే ఏమాత్రం సరిపోదన్నారు. ఎకరాకు కనీసం రూ. 15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గొల్లపల్లి రిజర్వాయర్‌కు హంద్రీ–నీవా నీటిని నామమాత్రంగా ఇస్తున్నారన్నారు. దీనికింద ఉన్న 10 వేల ఆయకట్టు రద్దు చేశారన్నారు. చివరిదాకా నీళ్లు తీసుకెళ్లి తర్వాత ఆలోచిస్తామని ముఖ్యమంత్రి చెప్పారంటే మన జిల్లాలో ఒక ఎకరా ఆయకట్టుకు నీళ్లివరనేది స్పష్టమవుతోందని విమర్శించారు. మాజీ మేయర్ రాగే పరుశురాం మాట్లాడుతూ విదేశాలకు వెళ్లినప్పుడు కలలో కూడా అనంత జిల్లా గుర్తుకు వస్తుందని చెప్పే ముఖ్యమంత్రి అభివృద్ధి హామీలు తప్ప ఒక్కటైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు. అనంత జిల్లాను వైఎస్ ప్రత్యేక దృష్టితో చూసి హంద్రీ–నీవా ఇచ్చారన్నారు. జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరిచ్చిన తర్వాతనే బయటకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.