–మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఎన్నికల్లో బూటకపు హామీలతో చంద్రబాబు అధికార పీఠం ఎక్కి ఆ తర్వాత అన్ని వర్గాలవారిని వంచించారని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి తెలిపారు. స్థానిక ఆర్‌డీఓ కార్యలయం ఎదుట ధర్నా చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల దీక్షా శిబిరాన్ని గురునాథరెడ్డి సందర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఎన్నికల సమయంలో బీజేపీ, సినిమా హీరో పవన్‌కళ్యాణ్‌తో కలిసి హామీలను గుప్పించారన్నారు. హామీలను నెరవేర్చకపోవడంతో వంచనకు గురైనవర్గాలవారు కఽలెక్టరేట్, ఆర్‌డీఓ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల మంది కాంట్రాక్ట్ అధ్యాపకులున్నారని, వారికి సమాన పనికి సమాన వేతనాన్ని అందించడం పెద్ద కష్టమైన పని కాదన్నారు.
మంగళవారం విద్యార్థి సంఘాలు, యువజన నాయకులు, కాంట్రాక్ట్ అధ్యాపకులతో కలిసి కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, మైనార్టీ నాయకులు ముక్తియార్, కాంట్రాక్ట్ అధ్యాపకులు హనుమంతరెడ్డి, శివారెడ్డి, ఎర్రప్ప, రామలింగా, రామాంజినేయులు, రాధమ్మ, రాధిక, భాస్కర్‌రెడ్డి, అరుణ, శంకరప్ప, రామన్న, సత్యనారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.