విజయవాడ: స్విస్ ఛాలెంజ్ పద్థతిలో ఏపీ రాజధాని నిర్మాణంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజధాని నిర్మాణంలో ప్రభుత్వం కుట్ర ఉందని వైఎస్ఆర్ సీపీ నేత పార్ధసారధి అన్నారు. అయితే తాము రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం పార్థసారధి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సమాచార లోపముందన్నారు. రాజధాని నిర్మాణం కొన్ని తరాలకు ఉపయోగపడేదని, అందరికీ ఆమోదయోగ్యమైన రాజధాని కావాలన్నారు.
చంద్రబాబు జేబు సంస్థలకే కాంట్రాక్టులు లభించాయని పార్ధసారధి విమర్శించారు. పునర్విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు కొన్ని హక్కులిచ్చారని, దీనిపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాజధానికి కేంద్రం నుంచి నిధులు వద్దనే ఈ నిర్ణయం తీసుకున్నారా అని ప్రశ్నలు సంధించారు. ప్రజాస్వామ్యంపై చంద్రబాబుకు గౌరవం లేదన్నారు. మీడియా ద్వారానైనా రాజధాని నిర్మాణానికి సంబంధించిన వాస్తవాలు ప్రజలకు తెలియాలన్నారు.
స్విస్ ఛాలెంజ్ పద్ధతి అంటే...
కాగా స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో రాజధాని నిర్మాణానికి కేబినేట్ ఆమోదించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్న విషయం తెలిసిందే. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తామని చెబుతున్నారు. అంటే, ఈ పద్ధతిలో బిడ్లను వేసిన తర్వాత, తక్కువ బిడ్ వేసిన వారికి కాంట్రాక్టును అప్పగించరు. తిరిగి పోటీలో ఉన్న కంపెనీ, అంతకన్నా తక్కువ ధరకు మెరుగైన డిజైన్ తో మరో ప్రణాళికను సమర్పించి కాంట్రాక్టును సొంతం చేసుకోవచ్చు. ఆ తర్వాత మరో సంస్థ ఇంకో డిజైన్ ఇచ్చి, అది అధికారులకు నచ్చితే కాంట్రాక్టు ఆ సంస్థకు లభించే అవకాశాలు దగ్గర చేసే పద్ధతి ఉంది. అదే స్విస్ ఛాలెంజ్ పద్ధతి. నియమిత సమయంలో ఓ కంపెనీ ఇలా ఎన్నిసార్లయినా కాంట్రాక్టును సవరించుకోవచ్చు.
'స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సమాచార లోపం'
Published Fri, Jun 24 2016 5:54 PM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM
Advertisement
Advertisement