swiss challenge system
-
స్విస్ ఛాలెంజ్ పద్ధతిలోనే నిర్మాణాలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో 1,691 ఎకరాల్లో నిర్మాణాలను స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో చేపడతామని మంత్రి నారాయణ తెలిపారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ సింగపూర్ కంపెనీలకు ఇంకా భూములను అప్పగించలేదన్నారు. సింగపూర్ కంపెనీలు డీపీఆర్ (సమగ్ర కార్యాచరణ ప్రణాళిక) మాత్రమే ఇచ్చాయని డీపీఆర్‌పై ఓపెన్ టెండర్లు పిలుస్తామని ఆయన తెలిపారు. జాతీయ కంపెనీలు కూడా టెండర్లలో పాల్గొనవచ్చని నారాయణ పేర్కొన్నారు. -
ప్రశ్నిస్తే మీదపడి కరుస్తున్నారు...: సీఆర్
హైదరాబాద్ : ఏపీ రాజధాని నిర్మాణంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. ఆయన శనివారం ఇందిరాభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. అమరావతి ప్రజా అమరావతి కాదని రైతుల దగ్గర చంద్రబాబు భూములు లాక్కున్నారు. తనకు నచ్చినవారికి భూములు కట్టబెడుతున్నారు. రాజధాని సెంటిమెంట్‌ను దోపిడీకి అనుకూలంగా మలచుకుంటున్నారు.స్విస్ ఛాలెంజ్ పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలను ఏమాత్రం సంప్రదించడం లేదన్నారు.రాజరికంలో కూడా ఇలా జరిగి ఉండదన్నారు. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన చంద్రబాబు... ప్రశ్నిస్తే వారిపై పడి కరవడం చేస్తున్నారని సి.రామచంద్రయ్య విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలా వ్యవహరించడం సరికాదన్నారు. మీడియాను నియంత్రించాలని చంద్రబాబు చూస్తున్నారని, అలా ఎన్నింటిపై నిషేధం విధిస్తారని ప్రశ్నించారు. ఏదో ఒకరోజు ప్రజలు నిన్ను, నీ పార్టీని బ్యాన్ చేస్తారంటూ చంద్రబాబుపై రామచంద్రయ్య నిప్పులు చెరిగారు. అధికారపక్షానికి, ప్రధాన ప్రతిపక్షానికి కేవలం ఒక్క శాతం ఓట్లు మాత్రమే తేడా ఉందన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. రాజధాని నిర్మాణంలో ఉల్లంఘనలు లేవని సర్టిఫికెట్ ఆయనకు ఆయనే ఇచ్చుకుంటున్నారన్నారు. ప్రపంచంలోనే అభ్యంతరకరమైన పద్ధతిని భారతదేశంలో అమలు చేస్తామనడం ఏంటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు తన రహస్య ఎజెండాను పక్కనపెట్టాలని సీఆర్ సూచించారు. లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్న ప్రాజెక్ట్ అని, వెంటనే గ్లోబల్ టెండర్లు పిలవాలన్నారు. ఎవరూ అర్హులు అయితే వాళ్లకే నిర్మాణ బాధ్యతలు అప్పగించాలన్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకు 45 రోజుల సమయం ఇస్తున్నామని అన్నారు. ప్రపంచంలో తానే తెలివైనవాడిననే భ్రమలో చంద్రబాబు ఉన్నారని, దాంతో రాష్ట్రాన్ని నాశనం చేయొద్దని సీఆర్ వ్యాఖ్యానించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని స్విస్ ఛాలెంజ్ పద్ధతిలోనే అమ్మేశారని ఆయన మండిపడ్డారు. -
ఇది అక్రమ ఒప్పందం
ఏపీ రాజధాని నిర్మాణ పనుల్లో స్విస్ ఛాలెంజ్ పద్ధతిని అనుసరించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, ఇది అక్రమ ఒప్పందమని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఇందులో పారదర్శకత లోపించిందని, గందరగోళంతో లబ్ధి పొందుదామని, ప్రజలను దోచుకుందామనే ఆలోచన తప్ప ఏమీలేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేశారని.. వ్యక్తిగత స్వార్థం, స్వలాభం, దురాలోచనతో దోపిడీ చేద్దామనే లక్షణాలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం తలపెడితే గ్లోబల్ టెండర్లు పిలిచి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచి నిపుణులను ఆహ్వానించాలని, కానీ దురదృష్టవశాత్తు ఇక్కడలా జరగడం లేదని చెప్పారు. చంద్రబాబు మీద అభిమానంతో సింగపూర్ కంపెనీలు వచ్చాయని చెబుతున్నారని.. అసలు సింగపూర్ దేశంలో ఉన్న కంపెనీలు ఏవైనా మదర్ థెరిసా లాంటి ట్రస్టులా, లాభాపేక్ష లేకుండా పనిచేసే స్వచ్ఛంద సంస్థలా అని ఆయన ప్రశ్నించారు. 2015లో భారతదేశ ప్రభుత్వం నియమించిన విజయ్ కేల్కర్ కమిటీ కూడా స్విస్ ఛాలెంజ్ విధానం మనకు పనికిరాదని చెప్పిందని, దాంతో అన్ని రాష్ట్రాలకు కేంద్రం అదే మాట చెప్పినా.. చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ఒకవేళ ప్రభుత్వం మారి, ఇపుడున్న ఒప్పందాలు రద్దయితే భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలన్న కేబినెట్ నిర్ణయాన్ని ప్రజలు గమనించాలని ఆయన తెలిపారు. -
'స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సమాచార లోపం'
విజయవాడ: స్విస్ ఛాలెంజ్ పద్థతిలో ఏపీ రాజధాని నిర్మాణంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజధాని నిర్మాణంలో ప్రభుత్వం కుట్ర ఉందని వైఎస్ఆర్ సీపీ నేత పార్ధసారధి అన్నారు. అయితే తాము రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం పార్థసారధి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సమాచార లోపముందన్నారు. రాజధాని నిర్మాణం కొన్ని తరాలకు ఉపయోగపడేదని, అందరికీ ఆమోదయోగ్యమైన రాజధాని కావాలన్నారు. చంద్రబాబు జేబు సంస్థలకే కాంట్రాక్టులు లభించాయని పార్ధసారధి విమర్శించారు. పునర్విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు కొన్ని హక్కులిచ్చారని, దీనిపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాజధానికి కేంద్రం నుంచి నిధులు వద్దనే ఈ నిర్ణయం తీసుకున్నారా అని ప్రశ్నలు సంధించారు. ప్రజాస్వామ్యంపై చంద్రబాబుకు గౌరవం లేదన్నారు. మీడియా ద్వారానైనా రాజధాని నిర్మాణానికి సంబంధించిన వాస్తవాలు ప్రజలకు తెలియాలన్నారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతి అంటే... కాగా స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో రాజధాని నిర్మాణానికి కేబినేట్ ఆమోదించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్న విషయం తెలిసిందే. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తామని చెబుతున్నారు. అంటే, ఈ పద్ధతిలో బిడ్లను వేసిన తర్వాత, తక్కువ బిడ్ వేసిన వారికి కాంట్రాక్టును అప్పగించరు. తిరిగి పోటీలో ఉన్న కంపెనీ, అంతకన్నా తక్కువ ధరకు మెరుగైన డిజైన్ తో మరో ప్రణాళికను సమర్పించి కాంట్రాక్టును సొంతం చేసుకోవచ్చు. ఆ తర్వాత మరో సంస్థ ఇంకో డిజైన్ ఇచ్చి, అది అధికారులకు నచ్చితే కాంట్రాక్టు ఆ సంస్థకు లభించే అవకాశాలు దగ్గర చేసే పద్ధతి ఉంది. అదే స్విస్ ఛాలెంజ్ పద్ధతి. నియమిత సమయంలో ఓ కంపెనీ ఇలా ఎన్నిసార్లయినా కాంట్రాక్టును సవరించుకోవచ్చు.