ఏపీ రాజధాని నిర్మాణ పనుల్లో స్విస్ ఛాలెంజ్ పద్ధతిని అనుసరించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, ఇది అక్రమ ఒప్పందమని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు.
ఏపీ రాజధాని నిర్మాణ పనుల్లో స్విస్ ఛాలెంజ్ పద్ధతిని అనుసరించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, ఇది అక్రమ ఒప్పందమని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఇందులో పారదర్శకత లోపించిందని, గందరగోళంతో లబ్ధి పొందుదామని, ప్రజలను దోచుకుందామనే ఆలోచన తప్ప ఏమీలేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేశారని.. వ్యక్తిగత స్వార్థం, స్వలాభం, దురాలోచనతో దోపిడీ చేద్దామనే లక్షణాలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం తలపెడితే గ్లోబల్ టెండర్లు పిలిచి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచి నిపుణులను ఆహ్వానించాలని, కానీ దురదృష్టవశాత్తు ఇక్కడలా జరగడం లేదని చెప్పారు.
చంద్రబాబు మీద అభిమానంతో సింగపూర్ కంపెనీలు వచ్చాయని చెబుతున్నారని.. అసలు సింగపూర్ దేశంలో ఉన్న కంపెనీలు ఏవైనా మదర్ థెరిసా లాంటి ట్రస్టులా, లాభాపేక్ష లేకుండా పనిచేసే స్వచ్ఛంద సంస్థలా అని ఆయన ప్రశ్నించారు. 2015లో భారతదేశ ప్రభుత్వం నియమించిన విజయ్ కేల్కర్ కమిటీ కూడా స్విస్ ఛాలెంజ్ విధానం మనకు పనికిరాదని చెప్పిందని, దాంతో అన్ని రాష్ట్రాలకు కేంద్రం అదే మాట చెప్పినా.. చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ఒకవేళ ప్రభుత్వం మారి, ఇపుడున్న ఒప్పందాలు రద్దయితే భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలన్న కేబినెట్ నిర్ణయాన్ని ప్రజలు గమనించాలని ఆయన తెలిపారు.